అధికార పక్షం వద్దు వద్దంటున్నా.. పంచాయతీ ఎన్నికలకు సై అంటూ ముందుకు కదిలింది ప్రతిపక్ష టీడీపీ. ఎస్ఈసీ నిమ్మగడ్డ భేషైన నిర్ణయం తీసుకున్నారని, సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం బతికిందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. అయితే రెండు విడతలు పూర్తయ్యే సరికే టీడీపీకి జ్ఞానోదయం అయింది.
ఫలితాలపై కాకి లెక్కలు చెప్పుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. ఈ దశలో మున్సిపాల్టీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలవుతుందని ఎస్ఈసీ ప్రకటించడంతో టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వాస్తవానికి టీడీపీ అసలు ఎన్నికలనే కోరుకోవడం లేదు.
ఒకవేళ జరిగినా.. కొత్తగా నామినేషన్లు, ఉపసంహరణలు.. హంగామా ఉండాలని భావిస్తోంది. దానికి భిన్నంగా పాత నామినేషన్లతోనే పనికానిచ్చేస్తారని తేలడంతో చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో ఎన్నికల్ని అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు బాబు.
ఎన్నికలు ఆగిపోయిన తర్వాత ఈ ఏడాది కాలంలో కొన్నిచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని, వారితోపాటు.. నామినేషన్లు వేసిన అభ్యర్థులు కూడా పార్టీ మారారని ఇదంతా తమకు ఇబ్బందిగా ఉందని టీడీపీ వర్గాలతో ఎస్ఈసీకి ఫిర్యాదులు చేయిస్తున్నారు. పనిలో పనిగా కోర్టుల్ని ఆశ్రయించి కొత్త నోటిఫికేషన్ కోసం డిమాండ్ చేయాలని చూస్తున్నారు.
పురపోరుపై ఎస్ఈసీ నిర్ణయం ప్రకటించి గంటలు గడుస్తున్నా చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచిత్రం. ఆయనే కాదు, ఆ పార్టీ నేతలెవరూ మున్సిపల్ పోరుపై నోరు మెదపడం లేదు.
మార్చి 10 పోలింగ్, మార్చి 14 లెక్కింపు అని తేల్చేయడంతో అటు వైసీపీ పథక రచన మొదలు పెట్టింది. పంచాయతీ ఫలితాలు ఇస్తున్న జోష్ తో వైసీపీ శ్రేణులు రెట్టించిన విశ్వాసంతో పురపోరుని ఎదుర్కొంటామంటున్నారు. దీంతో సహజంగానే టీడీపీ లో ఆందోళన మొదలైంది.
పాత నోటిఫికేషన్ తో, పాత నామినేషన్లతో ఎన్నికలు జరిగితే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, రాజకీయ రచ్చ చేయడానికి అవకాశం కూడా ఉండదనేది చంద్రబాబు ఆవేదన. అందుకే పురపోరు షెడ్యూల్ పై ఆయన స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయించారు.
కొత్త నోటిఫికేషన్ కోసం కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని, కొత్త నోటిఫికేషన్ వేయకపోతే ఎన్నికలకు అర్థమేలేదన్నట్టుగా వార్తల్ని వండివారుస్తున్నారు.