చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది మరి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నిలదీయాల్సింది కేంద్రాన్ని, అది పక్కాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. రాక రాక విశాఖ వచ్చిన చంద్రబాబు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మీద కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తారని అంతా ఆశించారు.
కానీ చంద్రబాబు షరా మామూలుగా జగన్ మీదనే విమర్శలు చేస్తూ అందులోనే ఆత్మానందం పొందడం ఉక్కు కార్మికులకు గట్టి షాక్ ఇచ్చింది. రోగం ఒక చోట ఉంటే మరో చోట మందు అన్నట్లుగా కేంద్రాన్ని నిలదీయాల్సిన చోట జగన్ మీద విరుచుకుపడుతూ చంద్రబాబు తెగ సంబరపడిపోయారు. ఏం తమ్ముళ్ళూ అంటూ వారిని కూడా రెచ్చగొట్టారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేది కేంద్రం, దానికి రాష్ట్రంతో ముడి పెట్టి జగన్ ని కార్నర్ చేసి చంద్రబాబు చేసిన మాటల గారడి పసుపు తమ్ముళ్ళకు ఆనందం కలిగించిదేమో కానీ ఉక్కు కోసం పోరాడుతున్న వారికీ మేధావులకూ మాత్రం విస్మయానికి గురి చేసింది.
ఇంత విశేష అనుభవం ఉన్న నాయకుడు, మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన బాబు ఇలా మాట్లాడమేంటని కూడా అంతా ఆశ్చర్యపడాల్సి వచ్చింది. ఇక్కడ ఒక పోలిక చెప్పుకోవాలి. సీపీఎంకి చెందిన జాతీయ కార్యవర్గ సభ్యుడు బీవీ రాఘవులు కూడా విశాఖ వచ్చారు. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇస్తూ కేంద్రాన్ని, మోడీని టార్గెట్ చేసి విమర్శలు చేశారు.
ఏపీకి మోడీ అన్యాయం చేశారని కూడా రాఘవులు హాట్ కామెంట్స్ చేశారు. మరి చంద్రబాబు ఈ లెక్కన ఎంతలా చెలరేగాలి. కేంద్రం మీద ఎలా విరుచుకుపడాలి. కానీ బాబు మాత్రం ఇదంతా వైసీపీ మీద బురద జల్లే కార్యక్రమంగా మార్చేసి విశాఖ ఉక్కు పోరాటాన్ని నీరు కార్చారని అంటున్నారు.