తన కెరీర్లోనే ఇది ఎంతో కొత్తగా అనిపిస్తోందని మన్మథుడు అక్కినేని నాగార్జున ఎంతో ఉద్వేగంగా చెబుతున్నారు. ఇంతకూ నాగార్జునను అంతగా ఎగ్జైట్కు గురి చేసిన సంఘటన ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ అగ్రహీరో, బిగ్‌బాస్ సీజన్-3,4లకు వరుసగా హోస్ట్ బాధ్యతలు నిర్వర్తించిన ఘనతను నాగార్జున దక్కించుకున్నారు. నాగార్జున కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది.
అయితే అంతకు ముందు సినిమా షూటింగ్‌ను ముగించుకుని కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండానే, కొత్త సినిమా షూట్ స్టార్ట్ కావడం నాగార్జునకు తీయని అనుభూతినిచ్చింది. ప్యాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'లో తన పాత్రకు సంబంధించి సోమవారం నాగార్జున షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఆ మరుసటి రోజే… అంటే నేడు కొత్త సినిమాను స్టార్ట్ చేయడం విశేషం.
ఈ సందర్భంగా నాగార్జున ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారు.
“నా సినీ కెరీర్లో ముందు రోజు ఓ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని, ఆ మరుసటి రోజే కొత్త సినిమాను స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకే ఎంతో కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమా విషయానికి వస్తే.. ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్.
చాలా రోజుల తర్వాత నేను ఈ రేంజ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాను. దర్శకుడు ప్రవీణ్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. దీంతో వెంటనే నేను ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాను” అని అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు.