పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఓట్ల లెక్కింపుపై ఏదైనా పంచాయతీలో ఒక్క ఓటరు కోరినా వీడియో తీయాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వీడియోగ్రఫీకి సంబంధించి ఎస్ఈసీ ఆదేశాలను పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించే బాధ్యత ఎస్ఈసీదే అని హైకోర్టు న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమయాజులు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును సీసీ కెమెరాలో రికార్డు చేయాలని లేదా వీడియో తీయాలని ఎస్ఈసీ ఈనెల 13న ఉత్తర్వులిచ్చింది.
ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేసేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఈనెల 17, 21 తేదీల్లో జరగనున్న మూడు, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రికార్డు చేసేలా ఆదేశించాలని పిటిషన్ల తరపు న్యాయవాది కోరారు.
ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈనెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈనెల 15న ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికపరంగా పూర్తిగా సీసీ కెమేరాల ఏర్పాటుకు వీలు కాదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్న తీసుకున్న న్యాయస్థానం ఒక్క ఓటరు కోరినా వీడియో తీయాల్సిందేనని కీలక తీర్పు వెలువరించింది.