హెచ్‌​సీయూ భూములపై గళం విప్పిన సినీ తారలు

సినీ న‌టులు కొంద‌రు విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ, ప్రభుత్వ నిర్ణయం పట్ల త‌మ‌ ఆవేదనను, బాధను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మీడియాలో హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్శిటీ (హెచ్‌​సీయూ) భూముల వివాదం మారుమోగుతోంది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్​ఎస్​, బీజేపీ విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న 400 ఎకరాలు జీవ వైవిధ్యానికి అలవాలమని, ఆ భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తే అక్కడ ఉన్న జంతువులు, పక్షుల పరిస్థితి ఏంటని విద్యార్థులు, పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

కాని ప్రభుత్వం మాత్రం అది యూనివర్శిటీ భూమి కాదని, ప్రభుత్వ భూమి అని వాదిస్తోంది. కాని విద్యార్థులు ఆ వాదనను ఒప్పుకోవడంలేదు. యూనివర్శిటీ భూమిని తాము ఒక్క అంగుళం కూడా తీసుకోలేదని సర్కారు చెబుతోంది. ఎవరి వాదలను వారు బలంగా వినిపిస్తున్నారు. ఎవరూ తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో కొందరు సినిమా తారలు, టీవీ సెలబ్రిటీలు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రభుత్వ వాదనను నిరసిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అయితే విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇచ్చినవారిలో ప్రముఖ హీరోలుగాని, హీరోయిన్లుగాని లేరు.

ప్రముఖ యువ హీరోల్లో, హీరోయిన్లలో, డైరెక్టర్లలో, నిర్మాతల్లో, ఇతర సినిమా ప్రముఖుల్లో ఈ వివాదం గురించి ఇప్పటివరకు ఎవరూ నోరు విప్పలేదు. ప్రభుత్వంతో పెట్టుకోవడం ఎందుకని గమ్మున ఉండిపోయారు. అసలే టాలీవుడ్​ రేవంత్​ రెడ్డిని వ్యతిరేకిస్తోందని వార్తలు వచ్చాయి కదా. ఈ నేపథ్యంలో కామ్‌గా ఉండటం మంచిదని అనుకున్నారు. నిజానికి ఇది యూనివర్శిటీ సమస్య కాదు. సామాజిక సమస్య. హైదరాబాద్​ పర్యావరణ సమస్య. సరే…స్పందించడం, స్పందించకపోవడం వాళ్ల ఇష్టం.

విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపినవారిలో, ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదనను, బాధను వ్యక్తం చేసినవారిలో ప్ర‌కాశ్ రాజ్​, రేణు దేశాయ్​, ప్రముఖ దర్శకుడు నాగ్​అశ్విన్, నటుడు ప్రియదర్శి, నటీమణులు కావ్య కళ్యాణ్​రామ్​, ఫరియా అబ్దుల్లా, టీవీ యాకర్లు రష్మి, అనసూయ, సంగీత దర్శకుడు మణి శర్మ ఉన్నారు. ప్ర‌కాశ్ రాజ్​ కేసీఆర్​ సన్నిహితుడు. అంటే రేవంత్‌కు వ్యతిరేకమే కదా. అందుకే ఈ సమస్యపై గళం విప్పాడు.

ఈ విధ్వంసం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. తాను విద్యార్ధుల పక్షాన నిలబడతానని చెప్పాడు. హెచ్‌​సీయూ భూములను రక్షించుకునేందుకు అందరూ ఉద్యమించాలని రేణూ దేశాయ్​ కోరింది. ఈ విధ్వంసకాండలో ఎక్కడికి వెళ్లాలో అర్థంకాక మూగ జీవులు బిక్కుబిక్కుమంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగొందల ఎకరాల భూమిని అమ్ముకోవడం మన ఖర్మ అని నాగ్​అశ్విన్​ పోస్టు చేశాడు. జంతు ప్రేమికురాలైన రశ్మి కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియో పెట్టింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇతర సినిమా ప్రముఖులెవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.

7 Replies to “హెచ్‌​సీయూ భూములపై గళం విప్పిన సినీ తారలు”

Comments are closed.