ప‌వ‌న్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి బాబు రెడ్ సిగ్న‌ల్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గెలుపు భ‌యం ప‌ట్టుకుంది. దీంతో రెండు చోట్ల పోటీ చేస్తే, ఏదో ఒక చోటైనా గెల‌వొచ్చ‌ని అనుకుంటున్నారు. రెండు చోట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేయాల‌ని అనుకుంటుంటే, చంద్ర‌బాబు మాత్రం రెడ్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గెలుపు భ‌యం ప‌ట్టుకుంది. దీంతో రెండు చోట్ల పోటీ చేస్తే, ఏదో ఒక చోటైనా గెల‌వొచ్చ‌ని అనుకుంటున్నారు. రెండు చోట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేయాల‌ని అనుకుంటుంటే, చంద్ర‌బాబు మాత్రం రెడ్ సిగ్న‌ల్ వేసిన‌ట్టు తెలిసింది.

త‌న‌తో పాటు లోకేశ్ కూడా ఒక నియోజ‌క‌వ‌ర్గంలోనే పోటీ చేస్తున్న విష‌యాన్ని గుర్తు చేస్తూ, ఎన్నిక‌ల్లో ఇలాంటివ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మే అని, ధైర్యంగా క‌ద‌న‌రంగంలో దూకాల‌ని చంద్ర‌బాబు స్ఫూర్తి నింపుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

భీమ‌వ‌రంలో పోటీకి చాలా కాలం క్రిత‌మే చంద్ర‌బాబు, లోకేశ్ నుంచి ప‌వ‌న్ అనుమ‌తి పొందారు. ఒక్క చోటే పోటీ చేయాల‌ని కొన్ని నెల‌ల క్రిత‌మే ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు, లోకేశ్ స్ప‌ష్టం చేశారు. అప్ప‌ట్లో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌ని, ఎక్క‌డ నిల‌బ‌డ్డా గెలుస్తాన‌ని ప‌వ‌న్‌లో ధీమా క‌నిపించింది. ఎందుకో గానీ, ఈ మ‌ధ్య ప‌వ‌న్‌లో గెలుపుపై అనుమానం, భ‌యం అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న‌కిచ్చిన 24 సీట్ల‌లో రెండు చోట్ల పోటీ చేయాల‌నే మ‌న‌సులో మాట‌ను చంద్ర‌బాబు ఎదుట బ‌య‌ట పెట్టిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. ప‌వ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టు తెలిసింది. భ‌యంతో రెండు చోట్ల పోటీ చేస్తే, ఏ ఒక్క‌రూ న‌మ్మ‌ర‌ని, దీంతో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌ని ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు హిత‌బోధ చేసిన‌ట్టు టీడీపీ ముఖ్య నేత‌లు తెలిపారు. చివ‌రికి ప‌వన్‌క‌ల్యాణ్ నిర్ణ‌యం ఏంట‌నేది ఉత్కంఠ రేపుతోంది.