చంద్రబాబునాయుడు అన్ని వర్గాల విశ్వాసాన్ని కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం బాబు చెప్పేదొకటి, చేసేదొకటి. బీసీ డిక్లరేషన్ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారంటే… వారిలో నమ్మకాన్ని కోల్పోయామని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు. నారా వారి మాటలకు అర్థాలే వేరు. ఔనంటే కాదనిలే, కాదంటే ఔనని చంద్రబాబును అర్థం చేసుకోవాలి. టీడీపీకి బీసీలు వెన్నెముక అనేది ఎన్టీఆర్ కాలం నాటి మాట. ఇప్పుడు టీడీపీ వెన్నెముక కమ్మ సామాజిక వర్గం మాత్రమే.
అందుకే ఇప్పటి వరకు ప్రకటించిన 94 మందిలో ఒక్క కమ్మ సామాజిక వర్గానికి 21 సీట్లను చంద్రబాబు కట్టబెట్టారు. అలాగే జనసేన ప్రకటించిన ఐదుగురి జాబితాలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చోటు దక్కింది. 94 మందిలో బీసీలకు దక్కిన సీట్లు కేవలం 18 సీట్లు మాత్రమే. జనసేన ప్రకటించిన ఐదుగురి జాబితాలో బీసీలకు కేటాయించింది ఒకే ఒక్క సీటు మాత్రమే. ఈ పార్టీలు కలిసి జయహో బీసీ అంటూ స్టేజీ నాటకాలు అడుతుంటే, పసిగట్టలేని అజ్ఞానంలో బీసీలున్నారని ఎలా అనుకుంటున్నారో మరి!
బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు ప్రసంగంలోని కీలక అంశాల్ని పరిశీలిద్దాం. ఆయన ఏమన్నారంటే… ‘బీసీలను పల్లకీ మోసే బోయీలుగా మాత్రమే కొందరు పరిగణిస్తున్నారు. తాము పల్లకీలో కూర్చుని వారితో మోయిస్తున్నారు. ఈ పరిస్థితిని మేం మారుస్తాం’ అని భారీ డైలాగ్‌లు కొట్టారు. ఇదే నిజమైతే, సగ జనాభా ఉన్న బీసీలకు 94 సీట్లలో 18, అలాగే నాలుగు శాతం జనాభా ఉన్న కమ్మ వారికి ఏకంగా 21 సీట్లు ఇవ్వడం ఏంటి?
బాబు చెబుతున్న దానికి, ఆచరణకు పొంతన లేదని బీసీలు ఇప్పటికే గుర్తించారు. అందుకే టీడీపీ అంటే బాబు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా గుర్తించి, దానికి బీసీలు దూరమయ్యారు. ఇదే జగన్ విషయానికి వస్తే జయహో బీసీ సభ పెట్టిన నియోజకవర్గం సీటునే తన సామాజిక వర్గానికి తీసేసి, బీసీకి కేటాయించారు. అలాగే నరసారావుపేట ఎంపీ స్థానం నుంచి బీసీని నిలబెట్టడానికి ఒక సంపన్నుడైన కమ్మ ఎంపీని చేజేతులా పోగొట్టుకున్నారు. కందుకూరు, మైలవరం నియోజకవర్గాల్లో వైసీపీ అగ్రవర్ణాల వారిని తప్పించి, బీసీలను నిలబెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. అందుకే బీసీలు ఇప్పుడు వైసీపీకి అండగా నిలిచారనేది వాస్తవం.
బీసీ డిక్లరేషన్ పేరుతో ఏవో పథకాలు ఇస్తే, బీసీలంతా ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమ. బీసీలు కోరుకుంటున్నది రాజ్యాధికారం. రాజ్యాధికారం కల వైసీపీ ద్వారా సాకారం అవుతుందనే నమ్మకం, ఆ పార్టీ కేటాయిస్తున్న సీట్లే చెబుతున్నాయి. కానీ టీడీపీ-జనసేన కూటమి సీట్లన్నీ తమ సామాజిక వర్గానికి కేటాయించుకుంటూ , ఓట్ల కోసం తమను ప్రలోభ పెడుతున్నారని బీసీలు గ్రహించారు. జనసేన పార్టీని పవన్ సామాజిక వర్గంలో మెజార్టీ ఓటర్లు సొంత పార్టీగా భావిస్తారు. పవన్ ఐదు సీట్లు ప్రకటించగా, అందులో రెండు ఆయన సామాజిక వర్గానికి కేటాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
వైసీపీకి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారంటే, జగన్‌పై ఊరికే అభిమానం రాలేదు. తమ కలలను జగన్ ద్వారా సాకారం చేసుకోవచ్చనే నమ్మకం బీసీల్లో పెరిగింది. ఇప్పుడు సీట్ల కేటాయింపులో జగన్ మరింతగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వారంతా వెన్నెముకగా నిలుస్తున్నారు. నమ్మకం పొందాలంటే మాటలు కాదు, చేతలు ముఖ్యం. చంద్రబాబు చెప్పేదానికి, చేసే పనులకు పొంతన లేకపోవడం వల్లే ఆయన రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతున్నారు.