Advertisement

Advertisement


Home > Politics - National

జ‌గ‌న్ అంటే.. ముగ్గురు నేత‌ల్లో వ‌ణుకు!

జ‌గ‌న్ అంటే.. ముగ్గురు నేత‌ల్లో వ‌ణుకు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే ఏపీలో ముగ్గురు నేత‌లు వ‌ణికిపోతున్నారు. అందుకే జ‌గ‌న్‌పై ఆ ముగ్గురు ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటారు. భ‌యంతో జ‌గ‌న్‌ను నిద్ర‌లో కూడా ఆ ముగ్గురు నేత‌లు చంద్రబాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లోకేశ్ క‌ల‌వ‌రిస్తుంటార‌నే అభిప్రాయం వుంది. అందుకే త‌న రాజ‌కీయ జీవితంలో జ‌గ‌న్ లాంటి లీడ‌ర్‌ను ఎప్పుడూ చూడ‌లేద‌ని చంద్ర‌బాబునాయుడు పదేప‌దే విమ‌ర్శిస్తుంటారు.

ముగ్గురు నేత‌ల‌ను జ‌గ‌న్ టార్గెట్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబు మెజార్టీని జ‌గ‌న్ త‌గ్గించ‌గ‌లిగారు. మంగ‌ళ‌గిరిలో లోకేశ్‌ను, భీమ‌వ‌రంలో, గాజువాక‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వైఎస్ జ‌గ‌న్ ఓడించి, గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఈ ద‌ఫా చంద్ర‌బాబును కూడా ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో జ‌గ‌న్ ఉన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి బాబులో ఓట‌మి భ‌యాన్ని క‌లిగించారు.

దీంతో కుప్పానికి రెండు నెల‌ల‌కు ఒక‌సారి స్వ‌యంగా చంద్ర‌బాబే వెళ్లి ప‌ర్య‌వేక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఏదో చేస్తాడ‌నే భ‌యం మాత్రం బాబును వెంటాడుతోంది. వై నాట్ కుప్పం అని జ‌గ‌న్ బ‌ల‌మైన నినాదంతో మైండ్ గేమ్‌కు తెర‌లేపారు. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారు. భారీ సంఖ్య‌లో న‌మోదైన టీడీపీ దొంగ ఓట్ల‌ను తొల‌గించార‌ని స‌మాచారం. కుప్పంలో గెలుపుపై వైసీపీ ధీమాగా వుంది.

లోకేశ్ విష‌యానికి మ‌ళ్లీ మంగ‌ళ‌గిరిలోనే పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. లోకేశ్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మంగ‌ళ‌గిరి టీడీపీ కంచుకోట కాదు. అలాంటి చోట పోటీ చేయాల‌నే ఆలోచ‌న మంచిదో, కాదో లోకేశ్‌కే తెలియాలి. తాజాగా లోకేశ్‌ను ఓడించేందుకు వైసీపీ ప‌ద్మ వ్యూహాన్ని ర‌చించింది. లోకేశ్‌పై మురుగుడు లావ‌ణ్య‌ను బ‌రిలో నిలిపింది. లావ‌ణ్య అత్తింటి, మెట్టినింటి కుటుంబాలకు బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం వుంది.

అంతేకాదు, మంగ‌ళ‌గిరిలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గమైన చేనేత‌ల్లో లావ‌ణ్య‌కు మంచి ప‌ట్టు వుంది. వైసీపీ అభ్య‌ర్థిగా లావ‌ణ్య‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత మంగ‌ళ‌గిరిలో అధికార పార్టీ గెలుపు అవ‌కాశాలు మెరుగు ప‌డ్డాయ‌నే టాక్ వినిపిస్తోంది. మంగ‌ళ‌గిరిలో ఇత‌ర సామాజిక వ‌ర్గాల బ‌లం కూడా వైసీపీకి తోడుగా వుంద‌ని అంటున్నారు. ఎన్నిక‌లు స‌మీపించే స‌మ‌యానికి వైసీపీ పైచేయి సాధిస్తుంద‌ని తాజా ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. రెండోసారి కూడా లోకేశ్ ఓడిపోతే, ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్టే. జ‌గ‌న్ అన్నంత ప‌ని చేస్తాడ‌నే భ‌యం లోకేశ్‌ను వెంటాడుతోంది.

ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌యం గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈయన వేదిక‌ల‌పైన్నే పులి. బ‌హిరంగ స‌భ‌ల‌పై ఊగిపోతూ, గ‌ట్టిగ‌ట్టిగా కేక‌లు వేస్తూ, ఏం మాట్లాడుతుంటారో కూడా అర్థం కాదు. ఇదంతా జ‌గ‌న్‌పై కోపంతోనే. రెండు చోట్ల జ‌గ‌న్ ఓడించార‌నే భ‌యం ఇప్ప‌టికీ పీడ‌క‌ల‌లా ప‌వ‌న్‌ను వెంటాడుతోంది. టీడీపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోడానికి కార‌ణాలు ఏవేవో చెబుతుంటారు.

అస‌లు కార‌ణం మాత్రం... ఒంట‌రిగా పోటీ చేస్తే ఓడిస్తార‌నే భ‌య‌మే. అందుకే ఒంట‌రిగా పోటీ చేసి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ప‌దేళ్ల క్రితం పార్టీ పెట్టి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రిస్థితి ఇదీ. తాజా ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. తానెక్క‌డ పోటీ చేసేది ముందే చెబితే, జ‌గ‌న ఏం చేస్తాడో అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌యంతో నిలువెల్లా వ‌ణికిపోతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ, గెలుపు సీటు ఇంకా దొర‌క‌లేదు.

ఇంకా ఏదో భ‌యం. జ‌గ‌న్ త‌న‌ను నీడ‌లా వెంటాడుతున్నాడ‌ని ఉలిక్కి ప‌డుతున్నారు. ఈ ద‌ఫా గెలిస్తే చాలు, అదే ప‌దివేల‌ని ప‌వ‌న్ అనుకుంటున్నారు. భీమ‌వ‌రం, పిఠాపురం...ఇంకా ఏవేవో నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తార‌ని చెప్ప‌డం, మ‌ళ్లీ కొత్త నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం వెనుక జ‌గ‌న్‌ను క‌న్ఫ్యూజ్ చేయ‌డానికే అని చెబుతున్నారు. ఇవ‌న్నీ ప‌వ‌న్ భ‌యం నుంచి పుడుతున్న‌వే. చివ‌రికి ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎంచుకుంటారో జ‌న‌సేన శ్రేణుల‌కే తెలియ‌ని ప‌రిస్థితి. మ‌ళ్లీ ముగ్గురు నేత‌లు జ‌గ‌న్‌పై బ‌హిరంగ స‌భ‌ల్లో మాత్రం చెల‌రేగిపోతుంటారు. భ‌యం ఆ ప‌ని చేయిస్తుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?