టీడీపీ అధినాయకత్వం తొలి జాబితాలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు లేదు. ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ కోరిందని వార్తలు వచ్చాయి. అది నిజమని గంటా మీడియా ముఖంగా చెప్పారు. తాను విశాఖ నుంచే పోటీ చేస్తాను అని ఆయన చెప్పారు.
ఇటీవల చంద్రబాబుని కలసిన తరువాత తన సీటు విషయం చంద్రబాబు చూసుకుంటారు అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఇపుడు భీమిలీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు అంటున్నారు. ఈ మేరకు ఆయన తన కసరత్తుని ప్రారంభించారు అని అంటున్నారు.
గంటా 2014లో భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి అయ్యారు. ఆ సెంటిమెంట్ తో మళ్లీ అక్కడ నుంచే పోటీ చేస్తాను అని అంటున్నారు. ఈ సీటుని పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాలని అనుకుంటున్నారు.
గంటా మాత్రం భీమిలీ కంటే తనకు బెస్ట్ సీటు లేదని భావిస్తున్నారు. హై కమాండ్ ఏమి నిర్ణయిస్తుందో రెండవ జాబితాలో ఎవరి పేరు ఉంటుందో తెలియదు కానీ గంటా మాత్రం భీమిలీ నుంచి పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తనకు అన్ని విధాలుగా కలసి వచ్చిన భీమిలీ సీటే తనకు ఎంతో సేఫ్ అని ఆయన భావిస్తున్నారుట. ఎన్నికల షెడ్యూల్ తొందరలో వెలువడుతున్నా టీడీపీ అభ్యర్ధుల జాబితా రెడీ కాలేదు. దాంతో చాలా మంది ఆశావహులు జనంలోకి వెళ్ళిపోతున్నారు. భీమిలీలో కూడా గంటా తానే టీడీపీ అభ్యర్ధిగా ప్రచార పర్వంలోకి తొందరలో దిగుతారు అని అంటున్నారు.