వార్ధక్య కష్టాలు కులాన్ని బట్టి మారుతాయా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించారు. చాలా ఆర్భాటంగా అనేకానేక హామీలను కూడా ప్రకటించేశారు. వాటిలో బీసీలకు 50 ఏళ్లు నిండితే చాలు.. వారికి వృద్ధాప్య పెన్షను ఇస్తాం అనేది…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించారు. చాలా ఆర్భాటంగా అనేకానేక హామీలను కూడా ప్రకటించేశారు. వాటిలో బీసీలకు 50 ఏళ్లు నిండితే చాలు.. వారికి వృద్ధాప్య పెన్షను ఇస్తాం అనేది కూడా ఒకటి.

ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక రకాల తాయిలాలు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తాయిలాలు ఇవ్వడంలో కనీస విచక్షణ కూడా లేకపోతే దానిని ఎలా అర్థం చేసుకోవాలి. ముసలితనానికి సంబంధించిన కష్టాలు.. కులాన్ని బట్టి మారిపోతుంటాయా? అనే సందేహం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది.

సమాజాన్ని వృద్ధాప్య పెన్షను విషయంలో కూడా కులాల వారీగా విభజించాలని చూస్తున్న చంద్రబాబు కుటిలనీతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

జయహో బీసీ సభా సందర్భంగా చంద్రబాబునాయుడు చాలా హామీలు ప్రకటించారు. అన్నీ తాయిలాలే. పెళ్లికానుకను పెంచడం, విద్యాపథకాలను పునరుద్ధరించడం, అన్ని నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు వంటివి అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఓకే.. కానీ.. యాభయ్యేళ్లకే వృద్ధాప్య పెన్షన్లను బీసీలకు మాత్రం ఇస్తానని ప్రకటించడం కామెడీగా ఉంది. బీసీలు అయినంత మాత్రాన తొందరగా ముసలివాళ్లయిపోతారా? అనేది ప్రజల సందేహం. ఇది కేవలం సమాజాన్ని కులాల ప్రాతిపదికన విచ్ఛిన్నం చేసే దురాలోచన అని కూడా అంటున్నారు.

అదే సమయంలో ఆ పెన్షన్లను నెలకు రూ.నాలుగువేలకు పెంచుతానని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ పెంపు కేవలం బీసీలకు మాత్రమేనా? లేదా, ఇతరత్రా వృద్ధులకు కూడా నాలుగువేలు చేయబోతున్నారా? అనేది క్లారిటీ లేదు. సైగా ఈ పెంపును ఒకే దఫా పెంచుతారా? విడతల్లోనా? అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే- జగన్ 3 వేల పెన్షను ప్రకటించి నాలుగు విడతల్లో పెంచారు. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. తనను 2019 ఎన్నికల్లో గెలిపించి ఉంటే.. ఒకే విడతలో పెన్షనును 3000కు పెంచి ఉండేవాడిని అని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. దానిని బట్టి చూస్తే, ఆయనలో నిజాయితీ ఉంటే గనుక.. ఇప్పుడు ప్రకటిస్తున్న నాలుగువేల మొత్తానికి ఒకే దఫాగా పెంచాలి.

అలా ఒకే దఫాగా, అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతానని ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే.. ఎప్పటిలాగా మాయమాటలతో పెన్షను పెంపు విషయంలోకూడా ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు మాటల్ని ఒక పట్టాన నమ్మలేం అని ప్రజలు అనుకుంటున్నారు.