చంద్రబాబునాయుడు.. బీసీలను ఆకట్టుకోవడం లక్ష్యంగా వారికి అనేక వరాలను ప్రకటించారు. అందులో ఆకర్షణీయమైనవి ఉన్నాయి. అందమైనవి ఉన్నాయి. ప్రజలు అద్భుతంగా భావించేవీ ఉన్నాయి. అదే సమయంలో అచ్చంగా బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఉద్దేశించిన హామీలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి.. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా తీర్మానం చేస్తాం అని ప్రకటించడం.
ఎందుకంటే- చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది చంద్రబాబునాయుడు చేతిలో ఉండే పని కాదు. అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనూ ఉండే పని కాదు. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం గురించిన వ్యవహారమే కొన్ని దశాబ్దాల పాటు పార్లమెంటులో నలిగి నలిగి ఎట్టకేలకు చట్టం రూపుదాల్చింది. ఇప్పుడు చంద్రబాబు బీసీలకు 33 శాతం రిజర్వేషన్ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఇది కేవలం బీసీలను మభ్యపెట్టడానికి మాత్రమే అని అందరికీ తెలుసు.
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చాలా కాలంగా.. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ గురించిన డిమాండును వినిపిస్తున్నారు. అది కేంద్రం చేయాల్సిన పని. అయితే.. బీసీలను మభ్యపెట్టడానికి చంద్రబాబు దానిని అందిపుచ్చుకున్నారు. అలాంటి తీర్మానం చేస్తామని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తీర్మానం చేసినంత మాత్రాన అలాంటి రిజర్వేషన్ వస్తుందా? అంటే భ్రమే. ఎందుకంటే పూర్తిగా కేంద్రం ఒప్పుకోవాలి. మరి అందుకోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి చంద్రబాబు పనిచేస్తారా లేదా చెప్పాలి.
తమ పార్టీ తరఫున ఎంపీలు కూడా గెలిస్తే.. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చేవరకు పార్లమెంటులో నిత్యం పోరాటం సాగిస్తామని, అక్కడ అధికారం చెలాయించే పార్టీకి ఏ బిల్లుల విషయంలోనూ ఎలాంటి సహకారమూ అందించబోమని ఆయన ప్రకటించాలి. అలా కాకుండా.. ఏదో బీసీలను బురిడీ కొట్టించడానికి మేం తీర్మానం చేస్తాం అని చెప్పేసి.. ఆ తీర్మానం గురించి పట్టించుకోని కేంద్రప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనమూ నెరవేరదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే- చంద్రబాబుకు బీసీలకు 33 శాతం రిజర్వేషన్ అనే మాట మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా దాన్ని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలే ఒక మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో తమ కూటమి తరఫున ఎంపిక చేసే అభ్యర్థుల్లో 33 శాతం సీట్లు బీసీలకే ఇవ్వాలి. రిజర్వేషన్ అనేది చట్టంగా ఉన్నా లేకపోయినా.. ఆ పని తమ పార్టీ తరఫున చేసినప్పుడు.. అలాంటి ప్రతిపాదన మీద ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నదనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది. మరి చంద్రబాబు తమ కూటమి తరఫున 33 శాతం సీట్లను బీసీలకు ఇవ్వబోతున్నారా? వేచిచూడాలి!