దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి ఎవరైనా సరే భారీ మెజార్టీతో గెలిచి తీరుతానని ఆయన అన్నారు. దెందులూరులో రెండో సిద్ధం సభను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీగా జనం వెళ్లారు. దీంతో కోస్తా జిల్లాల్లో వైసీపీ మరోసారి జోష్ ప్రదర్శించింది.
ఇదిలా వుండగా దెందులూరు టీడీపీ టికెట్‌పై ఉత్కంఠ నెలకుంది. టీడీపీ ఇన్‌చార్జ్ చింతమనేని ప్రభాకర్‌కు టికెట్ ఇవ్వడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. చింతమనేనికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కాదు, కూడదని ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ఆయన వ్యతిరేకులు, జనసేన కార్యకర్తలు, నాయకులు హెచ్చరించడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.
మరోవైపు చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దని పవన్‌కల్యాణ్ సూచించినట్టు చెబుతున్నారు. తనకు కాకుండా ఎవరికి ఇస్తారని చింతమనేని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కీలక కామెంట్స్ చేశారు. చింతమనేనిలాగా అహంకారంతో వ్యవహరిస్తే ఎవరినైనా ప్రజలు దూరం పెడతారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి చింతమనేని అయినా, లేక మరెవరైనా తనకు 50 వేల మెజార్టీ వస్తుందని అబ్బయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు.
పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని దెందులూరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాల్సిన అవసరం వుందన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అన్నారు.