ఈ నెల 10న నిర్వహించే నాలుగో విడత సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో విడుదల వుండకపోవచ్చని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10న సిద్ధం సభలో సీఎం జగన్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటనపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మేనిఫెస్టో విడుదల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారని తెలిసింది. సిద్ధం సభలో వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని సమాచారం.
సిద్ధం సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తే, మీడియా దృష్టంతా దానిపైనే వుంటుందని జగన్ ఉద్దేశం. అందుకే మేనిఫెస్టో విడుదలపై ఎవరూ మాట్లాడొద్దని జగన్ సూచించారని తెలిసింది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు ఏవి వుండాలనే విషయమై సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్పారు.
గతంలో కంటే మరింతగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు వుంటాయని అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టో లీక్ కాకుండా సీఎం జాగ్రత్తలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో ఏముంటాయనే విషయమై వైసీపీ ముఖ్య నేతలెవరూ నోరు మెదపడం లేదు.