ఆంధ్ర సిఎమ్ జగన్ మళ్లీ మరోసారి అదే పాట పాడారు. అదే మాట అన్నారు. మళ్లీ గెలిస్తే, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇక్కడ నుంచే పాలన సాగిస్తాను అని. విశాఖ నుంచి పాలన అన్నది జగన్ దృష్టిలో ‘అరువు రేపు’ టైపు.
ఆయనకు విశాఖ గుర్తు వచ్చినపుడల్లా ఈ మాట అనేస్తుంటారు. మళ్లీ మరిచిపోతుంటారు. ఎందుకు అలా అన్నది ఆయనకు మాత్రమే తెలియాలి. కానీ ఇలా తరచు అంటూ వస్తూ వుండడం వల్ల, ఇదో పెద్ద జోక్ గా మారిపోతోంది అన్న సంగతిని అయినా ఆయన గుర్తించారా? లేదా? అన్నది డవుటే.
అయితే ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి. విశాఖ వాసులకు కూడా తమ పట్టణాన్ని రాజధాని చేస్తామంటే ఏమాత్రం పట్టలేదు. అమరావతి జనాలు తమకే కావాలి అంటే మాకు ఎందుకు వద్దు అని విశాఖ వాసులు ఏనాడూ రోడ్డు ఎక్కలేదు. పైగా రాజధాని వస్తే నానా బీభత్సం అయిపోతుందని, ఎల్లో మీడియా, అమరావతిలో పెట్టుబడులు భారీగా పెట్టిన సామాజిక వర్గం చేసిన ప్రచారాన్నే నమ్మారు. తమకు వద్దని అన్నవారు కూడా వున్నారు.
నిజానికి ఇదే కర్నూలుకు రాజధాని అని జగన్ ప్రకటించి వుంటే, అమరావతి ఉద్యమాన్ని మించిన ఉద్యమాన్ని రాయలసీమ వాసులు నిర్మించి వుండేవారు. ఉత్తరాంధ్ర వాసుల మెతకవైఖరి కారణంగా అలాంటి సీన్ ఇక్కడ లేకపోయింది. మరి ఉత్తరాంధ్ర వాసుల నీరసభావం గమనించో, లేక మరేవైనా అడ్డంకులు వున్నాయో తెలియదు కానీ ‘విశాఖ నుంచి పాలన’ అనేది గోడ మీద ‘అరువు రేపు’ అని రాసి పెట్టిన చందంగానే వుంది.
నిజానికి జగన్ ఇలా పదే పదే తేదీలు ఎందుకు ప్రకటిస్తున్నారో అర్థం కాదు. వెళ్లే ఆలోచన వుంటే వెళ్లిపోతే చాలు కదా, ప్రతి సారీ ప్రకటించడం, ఆ తరువాత మరిచిపోవడం. ఇదంతా ఓ ప్రహసనంగా మారిపోయింది. కోర్టు కేసుల కారణంగా ఇలా చేస్తున్నారేమో అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే క్యాంప్ ఆఫీసుగా విశాఖను ఎంచుకోవడం సిఎమ్ ఇష్టం. అయితే రుషికొండలో కట్టిన భవనాల నుంచే పాలన చేయాలనే కోరిక వుంటే మాత్రం చెప్పలేము.
ఇలాంటి సమస్యలు వున్నపుడు రాజధాని మీద పెద్దగా ఆసక్తి లేని ఉత్తరాంధ్ర వాసులకు పదే పదే రేపే.. రేపే అంటూ గుర్తు చేయడం ఎందుకు?