నంద్యాల లోక్‌సభ టీడీపీ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి చంద్రబాబునాయుడు ఝలక్ ఇవ్వనున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున మాండ్ర శివానందరెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కోసం గత ఐదేళ్లుగా ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తనకే నంద్యాల టికెట్ అని ఆయన నమ్మారు.
కానీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈమె నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలు. బాగా డబ్బున్న బైరెడ్డి కుమార్తెను ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. కొంత కాలంగా బైరెడ్డి తన కుమార్తె శబరి రాజకీయ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆరాట పడుతున్నారు.
బైరెడ్డి గతంలో తనపై చేసిన వివాదాస్పద కామెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పక్కన పెట్టారు. టీడీపీలో చేరుతానని చాలా కాలంగా బైరెడ్డి కోరుతున్నప్పటికీ, బాబు జాప్యం చేస్తూ వచ్చారు. అయితే మాండ్ర శివానందరెడ్డి కంటే బైరెడ్డి కుమార్తె శబరి సరైన అభ్యర్థిగా టీడీపీ ప్రచారం చేస్తుండడం విశేషం.
మాండ్రకు మొండి చేయి చూపి, శబరికి నంద్యాల ఎంపీ టికెట్ ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు బీజేపీలో వుంటూ, మరోవైపు టీడీపీతో రాజకీయ బేరాలు ఆడడం గమనార్హం. ఉన్న ఒకరిద్దరు నాయకులను కూడా బీజేపీ పోగొట్టుకునేలా వుంది. బలపడాల్సిన సమయంలో బీజేపీ ఖాళీ అవుతుండడం దేనికి సంకేతమో ఆ పార్టీ నాయకులు ఆలోచించాలి.