టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రచారం దారి తప్పినట్టే కనిపిస్తోంది. అధికారంలోకి రావడానికి కూటమి తరపున ప్రజలకు ఏం చేస్తుందో చెప్పడం ఆయన మానేశారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన మంచి ఏంటో గుర్తు చేయడం మానేశారు. ఎంతసేపూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు, వివేకా హత్యోదంతంపై ఘాటు విమర్శలకే బాబు పరిమితం అవుతున్నారు.
టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి ఇటీవల తాడేపల్లిగూడెంలో మొదటి ఎన్నికల శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రసంగాలు పేలవంగా సాగాయి. ఈ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగం జనసేనకు రాజకీయంగా భారీ నష్టాన్ని కలిగించాయి. సొంత వాళ్లను దూరం చేశాయి. తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ అనంతరం చంద్రబాబునాయుడు రెండు సభల్లో పాల్గొన్నారు.
ఈ సభల్లో బాబాయ్ హత్య, చెల్లి సునీత ప్రశ్నలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. వివేకా హత్య ఘటనను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లి సీఎం జగన్‌పై వ్యతిరేకతను సృష్టించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని చంద్రబాబు మరిచిపోతున్నారు. వివేకా హత్యను సీఎం జగన్‌కు ముడిపెట్టి, ఆయన్ను దోషిగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్న చంద్రబాబు తనపై ప్రజల అభిప్రాయం ఏంటో గుర్తు చేసుకుంటే మంచిది.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని లోకం నమ్ముతోంది. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసి, తీవ్ర మానసిక క్షోభకు గురి చేసి, చివరికి ప్రాణాలు పోయేలా చేశారనే చర్చను కాదనలేం. అంతేకాదు, ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబు నిజస్వరూపాన్ని కళ్లకు కట్టేలా …తన అల్లుడు ఎంత నీచుడో వివరించారు.
వెన్నుపోటుదారుడిగా ఒళ్లంతా మచ్చలున్న చంద్రబాబు, ఇప్పుడు జగన్ గురించి విమర్శలు చేస్తే జనం నమ్మే పరిస్థితి వుంటుందా? చంద్రబాబు విమర్శలు టీడీపీ శ్రేణులకు తియ్యగా వుండొచ్చు. కానీ మిగిలిన వారికి బాబు విమర్శలతో పనేంటి? రాష్ట్రానికి ఏం చేస్తారనేదే ప్రధానం. కనీసం తామే ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాల గురించి ప్రచారం చేసుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు.
వివేకా హత్యనే నమ్ముకుని ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు అనుకున్నట్టున్నారు. అదే జరిగితే, జగన్ నెత్తిన పాలు పోసినట్టే. ఎందుకంటే, జగన్ తన పాలనలో ఏం చేశారో వివరిస్తున్నారు. ప్రతి ఇంటికీ మంచి జరిగి వుంటేనే ఓట్లు వేయమని ఆయన కోరుకుంటున్నారు. అలాగే ఈ నెల 10న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ దఫా జగన్ ఎలాంటి హామీలిస్తారో అని జనం ఎదురు చూస్తున్నారు. జనానికి కావాల్సిన విషయాలను బాబు మాట్లాడకుండా, తనకు అవసరమైనవి మాత్రమే మాట్లాడ్డం వ్యూహాత్మక తప్పిదం.