గాజువాకలో సెగలూ పొగలూ!

అయిదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ని ఓడించిన గాజువాక వైసీపీ ఈ రోజు వర్గ పోరుతో సతమతం అవుతోంది. 2019లో పవన్ ని ఓడించి ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా కార్పోరేటర్…

అయిదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ని ఓడించిన గాజువాక వైసీపీ ఈ రోజు వర్గ పోరుతో సతమతం అవుతోంది. 2019లో పవన్ ని ఓడించి ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా కార్పోరేటర్ ఉరుకూటి రామచంద్రరావుని ఇంచార్జిగా నియమించారు. ఆనాటి నుంచి గాజువాక వైసీపీ వర్గ పోరుతో రగిలిపోతోంది.

ఇంచార్జి చందూ వర్గం ఒక వైపు ఎమ్మెల్యే వర్గం మరో వైపు అన్నట్లుగా వైసీపీ రాజకీయం ఉంది. చందుకు టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అంటూ తిప్పల వర్గం హై కమాండ్ మీద వత్తిడి పెడుతోంది. గాజువాక టికెట్ పోరు ఇద్దరు మంత్రుల మధ్య కూడా పోటీగా మారింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ చందూకు టికెట్ ఇప్పించారు.

మరో మంత్రి బొత్స సత్యనారాయణ మేయర్ కి అక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో నాన్ లోకల్స్ కి ఎలా టికెట్ ఇస్తారు అంటూ ఇంచార్జి చందూ వర్గం భారీ సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నిస్తోంది. చందూ ఈ విధంగా బల ప్రదర్శన చేశారు. హై కమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని అందరూ కలసి పనిచేయాలని కోరారు.

వర్గ పోరు వల్ల పార్టీ పరువు బజారున పడుతోందని అంటున్నారు. నాన్ లోకల్స్ కి టికెట్ ఇస్తే పార్టీలో ఎవరు పనిచేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ చెరో వర్గంలో చేరిపోయారు. ఇపుడు గాజువాక వైసీపీ తీరు చూస్తే రెండుగా చీలిపోయింది. వైసీపీ అధినాయకత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం మూలంగా ఇదంతా జరిగింది అని అంటున్నారు. కార్పోరేటర్ గా ఉన్న చందుని బలమైన సామాజిక వర్గం అని ఎంపిక చేశారు. అపుడు మొత్తం పార్టీ నేతలను పిలిచి నచ్చచెప్పలేకపోయారు.

దాంతో రావణకాష్టంగా అది రగులుతోంది. రెండు వర్గాలు వీధిన పడడంతో టీడీపీ జనసేన కూటమి చోద్యం చూస్తోంది. తాజా ఓటర్ల లిస్ట్ మేరకు  చూస్తే గాజువాకలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 75 వేల దాకా ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేన కలిపితే లక్షా ముప్పయి వేల పై దాటాయి. ఇపుడు ఆ రెండు పార్టీలు ఒక్కటిగా వస్తున్నాయి.

వైసీపీ అంతా ఐక్యంగా ఉంటే విజయం దక్కుతుందని అంటున్నారు. వర్గ పోరుతో చీలిపోతే మాత్రం గాజువాక ఈసారి ఇచ్చే ఫలితం వేరేగా ఉండినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఇప్పటికైనా హై కమాండ్ అందరినీ దగ్గర పెట్టి సర్దుబాటు చేయాలని కోరుతున్నారు.