Advertisement

Advertisement


Home > Politics - Opinion

అర్ధం కాని జగన్ రాజకీయ ప్రయోగాలు

అర్ధం కాని జగన్ రాజకీయ ప్రయోగాలు

ఈజీగా అయిపోయే పనులని కూడా కాంప్లికేట్ చేసుకునేవాళ్లని చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. అతి జాగ్రత్త కావొచ్చు, అక్కర్లేని కేలిక్యులేషన్ కావొచ్చు, అర్ధంలేని అపోహలు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. జనం నాడి తెలిసిన నాయకుడిగా పేరు పొందిన జగన్ మోహన్ రెడ్డి కూడా కొన్ని చిత్రమైన పనులు చేస్తున్నారు. 

ప్రత్యర్ధి బలంగా ఉన్న చోట అక్కడ ఎవర్ని నిలబెట్టాలి, ఆ స్థానాన్ని ఎలా కైవసం చేసుకోవాలి అనే దానిమీద కసరత్తు చేస్తే అర్ధముంటుంది. కానీ ప్రత్యర్థి అతి బలహీనంగా ఉన్న చోట, అసలు అభ్యర్థులే దొరక్క ప్రత్యర్ధి పార్టీ నాయకుడు దిక్కులు చూస్తున్న నియోజకవర్గాల్లో అనవసర మార్పులు గట్రా చేసి అక్కడ పార్టీలో అంతఃకలహాలకు దారి తీసి విషయన్ని కాంప్లికేట్ చేస్తే ఏమనుకోవాలి?! 

ఉదాహరణకి ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు వంటి ప్రాంతాల్లో తెదేపా-జనసేన కూటమికి సరైన అభ్యర్థులే దొరకడంలేదు. అలాంటి స్థానాల్లో ఆల్రెడీ బలంగా ఉన్న వైకాపా అభ్యర్థుల్ని వేరే చోటికి పంపి ఇక్కడ కొంత శూన్యతని సృష్టించుకుని, పైగా వేరే నాయకుల్ని ఇంచార్జులుగా పెట్టడంతో అంతర్గత కీచులాటలకి తెరలేపారు ముఖ్యమంత్రి. కేక్ వాక్ లా ఉన్న ఆ స్థానాల్లోని గెలుపుని ఇప్పుడు కాంప్లికేట్ చేసి పెట్టారు. 

ఇక మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో నలుగురు ఇంచార్జుల్ని మార్చారు. ఎందుకంత గందరగోళం? 

అలాగే సూళ్లూరిపేట, గిద్దలూరు వంటి దాదాపు 10-15 స్థానాల్లో 60 వేల పైచిలుకు మెజారిటీతో 2019 లో గెలిచిన అభ్యర్థుల స్థానాలున్నాయి. వారిలో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్ళల్లో విచ్చలవిడితనాన్ని ప్రదర్శించి స్థానిక వైకాపా నాయకులతో కూడా గొడవలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్లకి ఈ సారి టికెట్టివ్వద్దని లోకల్ నాయకులు విన్ననించుకున్నా కూడా మళ్లీ వాళ్లకే టికెట్లివ్వడంపై పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. 

ఆ విధంగా మార్చాల్సిన అవసరం లేని వాళ్లని మార్చేసి, మార్చాల్సిన అవసరం ఉన్నవాళ్లకి మళ్లీ టికెట్లిచ్చి గందరగోళాన్ని సృష్టించిన సందర్భం కనిపిస్తోంది. 

ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నప్పుడు ఆ స్థానంపై పార్టీకి మంచి పట్టు ఉండేది. అప్పట్లో వైజాగ్ కార్పొరేషన్ ని కూడా గెలిపించుకున్నాడాయన. భూదందాలు చేసిన ప్రత్యర్థుల్ని పూర్తిగా అణిచేసాడు. అదే సమయంలో ఆయనపై కొన్ని అభియోగాలు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయిని తప్పించి సుబ్బారెడ్డికి పగ్గాలు అప్పజెప్పారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పార్టీ పట్టు కోల్పోతూ వచ్చింది. క్రమశిక్షణాలోపం, విచ్చలవిడితనం ప్రజ్వరిల్లాయి.

సమర్ధవంతమైన నాయకత్వం వహించే వ్యక్తిలో ఒకవేళ అవినీతి కనిపిస్తే ఆ అవినీతిని తీసేయాలి తప్ప నాయకత్వాన్ని తీసేయడం తెలివైన పని అనిపించుకోదు కదా! 

విజయసాయి వల్ల తప్పు జరిగుంటే మందలించి మాట్లాడి ఆ పరిస్థితి మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. అలా కాకుండా స్థానభ్రంశం చేసేయడం వల్ల భవిష్యత్తు ఏమౌతుందో కూడా ఊహించాలి! ఆ ఊహ లేక పరిస్థితిని కాంప్లికేట్ చేసి ఇప్పుడు ఉత్తరాంధ్రలో తేలిగ్గా గెలిచే అభ్యర్థి లేకుండా చేసుకున్నట్టు అయ్యింది. 

ఇలాంటి తప్పులు చేసాక ఎవరో ఓడిస్తారని అనుకోనక్కర్లేదు..సొంత పార్టీ వాళ్లే ఓడించొచ్చు. 

పైకి తమకి టికెట్ ఇవ్వకున్నా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తానని చెప్పినా లోపల్లోపల ఆ అభ్యర్థి ఓడిపోవడానికి చెయాల్సిన పనులు చేస్తారు భంగపడ్డ నాయకులు. టికెట్ మార్చకుండా ఉండుంటే ఆ స్థానాన్ని పార్టీ గెలిచుండేది అని అనిపించుకున్నప్పుడే కదా ఏ నాయకుడి ప్రాబల్యమైన గుర్తింపబడేది. అందుకే అలాంటి చర్యలకి పాల్పడే సైలెంట్ రిబెల్స్ ఎంతోమంది తయారయ్యే ఉంటారు. 

ఇలాంటి అనవసర ప్రయోగాలు చేసి అనేకమైన కేక్ వాక్ స్థానాలని కాంప్లికేటెడ్ స్థానాలుగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడలు అర్ధం కాక పార్టీ శ్రేణులు జుట్టుపీక్కుంటున్నాయి. పార్టీలో పొడచూపిన అక్కర్లేని కీచులాటలకు కూడా కారణం ఈ షఫ్లింగులే అని వేరే చెప్పక్కర్లేదు. 

గెలుపోటములు దైవాధీనాలే అయినా మానవతప్పిదాలు ఉండకుండా చూసుకోవాలి కదా అని అంటున్నారు కొందరు వైకాపా నాయకులు. ఎవరి నిర్ణయం కరెక్టో, ఎవరిని మార్చినా ఎవరెక్కడ నిలబడ్డా జనం జగన్ మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారన్నది ఎంతవరకూ నిజమో అన్నీ తెలిపోతాయి ఒకటిన్నర నెల ఆగితే. ఏమౌతుందో చూద్దాం!

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?