వై నాట్ 175 అంటున్న బీఎస్పీ!

ఏపీలో మరో పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ మొత్తం 175 సీట్లకు తాము పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ మాజీ డీజీపీ జె…

ఏపీలో మరో పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ మొత్తం 175 సీట్లకు తాము పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు విశాఖ పర్యటనలో వెల్లడించారు. బహుజనుల కోసం కాన్షీరాం పార్టీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఏపీలో బహుజనుల రాజ్యం రావాలని ఆయన డిమాండ్ చేశారు.

ధనవంతులకే రాజకీయం పదవులు అన్న విధానాన్ని బీఎస్పీ మార్చుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ప్రధాన పార్టీలలో బడుగులు బలహీనులకు రాజ్యాధికారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు పూర్తిగా వ్యాపారాత్మకంగా మారాయని నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వారే ముఖ్యమంత్రులు అవుతున్నారని పూర్ణచంద్రరావు అంటున్నారు. సామాన్యులకు వేదిక బీఎస్పీ అని ఆయన అన్నారు. ఏపీకి విభజన హామీలు తేలేని ప్రధాన పార్టీలు ప్రజలను మభ్యపెట్టి వెలవాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు.

జీరో బడ్జెట్ పాలిటిక్స్ తాము చేస్తామని ఎన్ని ఓట్లు తమ పార్టీకి వచ్చినా సంతోషంగా స్వీకరిస్తామని ఆయన అన్నారు. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన విమర్శించారు. బీఎస్పీలో బడుగులు వెనకబడిన వర్గాల వారికి పెద్ద పీట వేస్తామని ఆయన అంటున్నారు. తాను పదవీ విరమణ తరువాత రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేయడానికే అని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం సీట్లకు పోటీ చేయడం ద్వారా ఏపీ రాజకీయాన్ని మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, 2019 ఎన్నికల్లో బీఎస్పీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అపుడు ఏపీకి వచ్చి మాయావతి ప్రచారం చేశారు. ఇపుడు జనసేన టీడీపీతో కూటమి కట్టింది. బీజేపీతో పొత్తులో ఉంది. దీంతో బీఎస్పీ మొత్తం సీట్లకు తామే పోటీ చేస్తామని ముందుకు వచ్చింది. బీఎస్పీ తో పాటు అనేక పార్టీలు ఈసారి పోటీలో ఉండడంతో ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది.