రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ ను ఎదుర్కొనేందుకు, ముందస్తు బెయిల్ కోసం దర్శకుడు క్రిష్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను అతడు వెనక్కు తీసుకున్నాడు.
అంతకుముందు క్రిష్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అతడి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. క్రిష్ నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను సేకరించారు. వాటి ఫలితాలు నెగెటివ్ గా తేలాయి. దీంతో క్రిష్ పై చర్యలు తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది.
మరోవైపు ఇవే రిపోర్టుల్ని కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నాడు క్రిష్. ఇకపై క్రిష్ ను అవసరమైతే విచారణకు పిలుస్తారు తప్ప, అతడ్ని అరెస్ట్ చేయరు.
ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి తిరిగిన మోడల్, యూట్యూబర్ లిషి గణేశ్, పోలీసుల విచారణకు హాజరైంది. ఆమెను దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.
లిషి గణేశ్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే, లిషిని రీహాబిటేషన్ సెంటర్ కు తరలిస్తారు. నెగెటివ్ వస్తే ఆమెను కూడా వదిలేస్తారు.