విజన్ విశాఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఒక అరుదైన కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి పలువురు పారిశ్రామిక వేత్తలు విశాఖకు వస్తున్నారు. 5న ముఖ్యమంత్రి జగన్ విశాఖకు చేరుకుని ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు.
విజన్ విశాఖ ఉద్దేశ్యాలను ఆయన పారిశ్రామికవేత్తలకు వివరిస్తారు. విశాఖ గ్లోబల్ సిటీగా ఎంతటి పొటెన్షియాలిటీ కలిగి ఉందో తెలియచేస్తారు. గత ఏడాది మార్చి 3,4 తేదీలలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి వచ్చిన పెట్టుబడుల గురించి జగన్ వివరిస్తారు. విశాఖ డాక్యుమెంట్ ని ఆయన రిలీజ్ చేస్తారు.
విశాఖ డెవలప్ మెంట్ ఏ విధంగా సాగుతోంది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నది ముఖ్యమంత్రి తెలియచేయడం ఈ ఈవెంట్ అతి ముఖ్య ఉద్దేశ్యం. కేవలం పారిశ్రామికవేత్తలే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈస్ట్ కోస్ట్ కి గేట్ వే విశాఖ అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియ చేయనుంది. విశాఖను గ్రోత్ ఇంజన్ గా చేసుకోవడంతో పాటు రానున్న కాలంలో ఏపీకి దిక్సూచిగా మార్చేందుకు గత అయిదేళ్లలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి వివరిస్తారు.
విశాఖలో దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రారంభోత్సవం చేస్తారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న జీవీఎంసీ భవనం స్థానంలో వంద కోట్లతో సువిశాలమైన భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. దానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా స్కిల్ సెంటర్లకు ఆయన శ్రీకారం చుడతారు.
విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ అని ఈ విషయంలో రెండవ మాట లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. తప్పుడు రాతలు రాస్తూ విశాఖ మీద విష ప్రచారం చేస్తున్న వారి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.