చంద్రబాబునాయుడు రాజగురువు రామోజీరావు పత్రిక ఈనాడు పచ్చపాతం పతాక స్థాయికి చేరింది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పాతాళం దిగువకైనా దిగజారడానికి ఆ పత్రిక వెనుకాడడం లేదు. తెలుగు మీడియా నుంచి నిష్పక్షపాత జర్నలిజాన్ని ఆశించడం అత్యాశే. కనీసం తమ విశ్వసనీయతను కొద్దోగొప్పో కాపాడుకునేందుకైనా కొన్ని నిజాల్ని రాయాల్సి వుంటుంది.
అదేంటో గానీ, తాము రాసిందే నిజమని పాఠకులు, జనం నమ్ముతారని రామోజీ మీడియా భావిస్తున్నట్టుంది. జనం నవ్విపోతారనే స్పృహ కూడా లేకుండా వైసీపీ విషయంలో దుర్మార్గంగా రాస్తూ, టీడీపీకి నష్టం కలిగిస్తాయనుకుంటే వాస్తవాల్ని దాచి పెట్టడం ఈనాడు పత్రికకే చెల్లింది. ఇందుకు ఇవాళ ప్రచురితమైన వార్తను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనాని పవన్‌కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఇందుకు సంబంధించిన వార్త రాయడం వరకూ బాగుంది. అయితే కాపును కొట్టి సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారంటూ ఈనాడు తన మార్క్ విష వార్తల్ని వండివార్చింది. కాపును కొట్టింది వైసీపీ మాత్రమే కాదు. టీడీపీ కూడా కాపులకు కాకుండా సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టడాన్ని ఈనాడు చాలా కన్వినియంట్‌గా దాచి పెట్టింది.
చిత్తూరు సీటు తమదే అని కాపులు భావిస్తారు. గత రెండు దఫాలుగా చూస్తే…2014లో డీకే సత్యప్రభ, 2019లో ఏఎస్ మనోహర్‌లకు టీడీపీ టికెట్ ఇచ్చింది. వీళ్లిద్దరూ కాపులే. 2024కు వచ్చే సరికి గురజాల జగన్‌మోహన్‌రావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఈయన కమ్మ సామాజిక వర్గం. తమకు కాదని బాబు తన సొంత సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాపులు చిత్తూరులో భారీ నిరసన ర్యాలీ చేశారు.
ఇవేవీ ఈనాడు పత్రికకు వార్తలనిపించలేదు. ఈ సమాచారాన్ని ఈనాడు దాచి పెట్టి, లోకానికి వాస్తవం తెలియకూడదని ఆరాట పడింది. ఇదే వైసీపీ టికెట్ విజయానందరెడ్డికి ఇస్తే కాపులెవరూ ఆందోళనలు చేయలేదనే విషయాన్ని ఈనాడు మరిచినట్టుంది. కులాల్ని రెచ్చగొట్టి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు కలిగించాలనే ఈనాడు పత్రిక పచ్చపాత దృష్టికి ఈ రాతలే నిదర్శనం.