బాబుకు షాక్: గెలుపు కంటే బలోపేతం ముఖ్యం!

ఏపీ బీజేపీ అభ్యర్థుల వడపోత అనంతరం తుదిజాబితాలకు రూపకల్పన చేయడం అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు షాక్ గా పరిణమించినట్లు కనిపిస్తోంది. Advertisement బిజెపితో కూడా పొత్తు కుదుర్చుకోవడం ద్వారా.. రాబోయే ఎన్నికల్లో…

ఏపీ బీజేపీ అభ్యర్థుల వడపోత అనంతరం తుదిజాబితాలకు రూపకల్పన చేయడం అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు షాక్ గా పరిణమించినట్లు కనిపిస్తోంది.

బిజెపితో కూడా పొత్తు కుదుర్చుకోవడం ద్వారా.. రాబోయే ఎన్నికల్లో ఎడ్వాంటేజీ సాధించాలని చంద్రబాబునాయుడు ఆశిస్తున్నారు. అయితే అభ్యర్థుల వడపోత సందర్భంగా.. కేంద్రపార్టీనుంచి వచ్చిన ప్రతినిధి సమక్షంలోనే పలువురు సీనియర్ నాయకులు.. భిన్నంగా వ్యవహరించినట్లుగా సమాచారం.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఆత్మహత్యా సదృశం అవుతుందని వారందరూ ముక్తకంఠంతో చెప్పినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం కంటె.. బలోపేతం కావడమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలని అనేక మంది నాయకులు సూచించినట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా తాము గెలిస్తే చాలు, తమ సొంత ప్రయోజనాలు నెరవేరితే చాలు అనుకుంటున్న నాయకులు మాత్రం పొత్తుకు సుముఖంగా ఉన్నారు. ఆర్థికంగా బలవంతులైన ఇలాంటి నాయకులు పార్టీ హైకమాండ్ మీద కూడా ఈ మేరకు వత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వలన తమ పార్టీ అధికారంలో ఉన్నట్లు అవుతుందని, ఆ కూటమి నెగ్గుతుందని, 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుందని రకరకాలుగా వారు అధిష్ఠానాన్ని మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే.. పార్టీలోని సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అవకాశవాద వలస నేతలు కాకుండా నిజంగా పార్టీ క్షేమాన్ని కోరుకునే వారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ పాలనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఎన్నికలకు వెళ్లడం అనేది ఆత్మహత్యా సదృశం అవుతుందని వారు వాదిస్తున్నారు.

తమ పార్టీ సొంతంగా అన్ని స్థానాలకు పోటీచేసినట్లయితే.. ఇటీవలి రామాలయ ప్రారంభోత్సవ క్రేజ్ కూడా కలిసి వచ్చి తమ ఓటుబ్యాంకు గణనీయంగా పెరుగుతుందని.. ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో విజయం దక్కే అవకాశంకూడా ఉన్నదని అంటున్నారు. గెలుపు దక్కకపోయినా సరే.. పార్టీ బలోపేతం కావడం గ్యారంటీ అని అంటున్నారు.

చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే గనుక.. వచ్చే ఎన్నికల నాటికి అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంతర్ధానం అవుతుందని.. అలాంటి సందర్భంలో.. భారతీయ జనతా పార్టీ సింగిల్ గానీ, జనసేనతో పొత్తులతో గానీ అధికారంలోకి రాగల, రాష్ట్రంలో పెద్దసంఖ్యలో సీట్లను గెలుచుకోగల స్థానానికి ఎదుగుతుందని వారు వాదిస్తున్నారు.

పొత్తులు పెట్టుకుని కేవలం కొన్ని చోట్ల పోటీ చేయడం వల్ల.. పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారందరూ కూడా.. అభ్యర్థుల వడపోత నిమిత్తం కేంద్ర కమిటీనుంచి వచ్చిన సీనియర్ నాయకుడు శివప్రకాష్ ఎదుటే పేర్కొనడం విశేషం.

ఏది ఏమైనప్పటికీ.. పొత్తులు అనే మాటతో సంబంధం లేకుండా.. భాజపా 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు ముగ్గురేసి వంతున అభ్యర్థుల తుదిజాబితాలను సిద్ధం చేసింది. వీటిని హైకమాండ్ కు పంపనున్నారు. జాబితాలను అక్కడ ఫైనలైజ్ చేస్తారని, పొత్తులపై కూడా వారే నిర్ణయం తీసుకుంటారని పురందేశ్వరి అంటున్నారు.

హైకమాండ్ కు దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై నిజంగా శ్రద్ధ ఉంటే.. పొత్తులు కాదంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే.. చంద్రబాబుకు అది పెద్ద షాక్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.