టీడీపీలో చేరకపోయినా బాబుకే జై!

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అమీతుమీ తేల్చుకోవాలనేంత పట్టుదలగా బరిలో తలపడిన సందర్భంలో కూడా ఇండిపెండెంటుగా విజయం సాధించిన నాయకుడు ఆయన. ఏ నిమిషంలోనైనా ఆయన సెంటర్లో నిలబడి సభ అని ప్రకటిస్తే గంటలోగా కనీసం…

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అమీతుమీ తేల్చుకోవాలనేంత పట్టుదలగా బరిలో తలపడిన సందర్భంలో కూడా ఇండిపెండెంటుగా విజయం సాధించిన నాయకుడు ఆయన. ఏ నిమిషంలోనైనా ఆయన సెంటర్లో నిలబడి సభ అని ప్రకటిస్తే గంటలోగా కనీసం కొన్ని వేల మంది గుమికూడుతారనే పేరుండేది. అయితే అదంతా కూడా గతించిపోయిన వైభవం. ఎమ్మెల్యేగా కాదు కదా.. కనీసం మునిసిపాలిటీ పరిధిలో కూడా తన ప్రజాబలాన్ని నిరూపించుకోలేని దీనస్థితికి వెళ్లిపోయారు. అలాంటి నాయకుడు ఇప్పుడు తెలుగుదేశానికి జైకొట్టినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఇలాంటి సందేహమే ఇప్పుడు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కలుగుతోంది.

చిత్తూరులో సికెబాబు అంటే తెలియని వారు ఉండరు. ఒక తరహా ముఠాతగాదాలకు పెట్టింది పేరైన చిత్తూరు నియోజకవర్గ పరిధిలో.. ఆయన సుదీర్ఘకాలం అనేక ప్రాణగండాలను తప్పించుకుంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు.

ఒకసారి ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గెలిచారు. క్రమంగా ఆయన హవా సన్నగిల్లిపోయింది. హింసా రాజకీయాలకు ప్రజల్లో విలువ లేకుండా పోయింది. ఆయన కొంతకాలంగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన తాజాగా ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్ మోహన్ కు మద్దతు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది.

ఆయన తెలుగుదేశంలో చేరలేదు గానీ.. చిత్తూరు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని తన అనుచరులతో సమావేశం పెట్టుకుని దిశానిర్దేశం చేశారు. అయితే.. ప్రజలు తిరస్కరించడం మొదలైన తర్వాతే ఆయన రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆయన ముద్ర గల హింసారాజకీయాల పట్ల స్థానిక ప్రజలకు క్రేజ్ పోవడం మాత్రమే కాదు కదా, ఏవగింపు కూడా పెరిగింది. ఇలాంటి సమయంలో ఆయన మద్దతు కూడా తెలుగుదేశానికి ప్రమాదకరమే అనే అంచనాలు ప్రజల్లో సాగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. జగన్ పట్ల ఏ కొంత వ్యతిరేకత ఉన్న వారినైనా, వారు రాజకీయాలనుంచి పూర్తిగా విరమించుకుని ఉన్నా సరే.. ప్రజలు వారిని మరచిపోయి ఉన్నా సరే.. వారిని ఇప్పుడు హఠాత్తుగా తెరమీదకు తీసుకువస్తూ.. తమకు వారి బలం ఉన్నదని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నది.

అయితే ప్రజలు ఆలోచించి ఓటువేసే పరిస్థితుల్లో ఇలాంటి గిమ్మిక్కులు పనిచేయవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తూరులో క్లీన్ పాలిటిక్స్ కోరుకునే వారిలో.. సీకెబాబు నుంచి లభించే మద్దతు ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది కదా అనుకుంటున్నారు.