తెలుగుదేశంతో బేరాలు సాగించి చచ్చీ చెడీ మొత్తానికి 24 సీట్లను దక్కించుకున్నారు పవన్ కల్యాణ్. కానీ.. ఆ మాత్రం సీట్లకైనా ఆయనకు అభ్యర్థులు ఉన్నారా? అనేది సందేహమే! ఎందుకంటే.. అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న వారిని ఇప్పటికిప్పుడు ఇతర పార్టీలనుంచి చేర్చుకోవడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు.
తమాషా ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ‘వీళ్లు పనికిరారు’ అని నిర్ణయించుకుని పక్కన పెట్టిన స్క్రాప్ సరుకును.. ఇప్పుడు హఠాత్తుగా పవన్ కల్యాణ్ నెత్తిన పెట్టుకుంటూ.. వారి సేవలు తమ పార్టీకి, సమాజానికి చాలా చాలా అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండడం! తాజాగా చిత్తూరు వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును జనసేనలో చేర్చుకోవడాన్ని గమనిస్తే మనకు ఇదే అర్థమవుతుంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అనేక సర్వేలు చేయించుకుంటూ ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదో తెలుసుకుంటే.. వాస్తవంగా ప్రజల్లో బలం ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు. ఆ క్రమంలో సిటింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ.. గత ఎన్నికల్లో దక్కిన ప్రజాదరణను నిలబెట్టుకోలేకపోయిన వారిని నిర్మొగమాటంగా పక్కన పెడుతున్నారు.
అలాంటి వారిలో పార్టీకి నిజంగా సేవచేసిన వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామంటూ మాట ఇస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కూడా గెలిచే అవకాశం లేని అభ్యర్థిగా తేలడంతో పక్కన పెట్టేశారు. అక్కడినుంచి ఆర్టీసీ వైస్ ఛైర్మన్ గా గతంలో పనిచేసిన విజయానంద రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.
అయితే అలకపూనిన అరణి శ్రీనివాసులు తాజాగా జనసేనలో చేరిపోవడం, ఆటోమేటిగ్గా వైసీపీ ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేయడం జరిగాయి. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వీళ్లు గెలిచే అవకాశం లేదు అని బలంగా నమ్మి.. పక్కన పెడుతున్న స్క్రాప్ సరుకును పవన్ కల్యాణ్ ఆర్భాటంగా తమ పార్టీలో చేర్చుకుంటూ ఏం సాధిస్తారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవలే వైసీపీ ఎమ్మెల్సీ జనసేనలో చేరారు. ఇప్పుడు శ్రీనివాసులు. గూడూరు సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా చేరుతారనే ప్రచారం ఉంది. జనసేనలో చేరడం, లేదా, పవన్ సలహా మేరకు నడుచుకోవడం చేస్తారని అనుకుంటున్నారు.
ఇలా వైసీపీ పనికిరారని అనుకుంటున్న వారినందరినీ పవన్ చేరదీస్తున్నారు. అరణి శ్రీనివాసులు కూడా రాజంపేట ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరులో ఎమ్మెల్యేగానే పనికిరారని అనుకున్న వ్యక్తి.. కేవలం కులాన్ని నమ్ముకుని పొరుగున ఉన్న రాజంపేట ఎంపీ సీటులో నెగ్గుతారా? అనేది అనుమానమే. పవన్ కొత్తగా వస్తున్న నాయకులపై పునరాలోచన చేయాలని.. దీనివలన ఎంతోకాలం నుంచి పార్టీని నమ్ముకున్న వారి అవకాశాలు పోతున్నాయని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.