పీకే మాటలు బాబు మంత్రాంగంలో భాగమా?

‘ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం తప్పదనే’ కీలకమైన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్. ఇదేదో దారిన పోయే దానయ్య చేసిన ప్రకటన అయితే ఎవ్వరూ కూడా…

‘ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం తప్పదనే’ కీలకమైన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్. ఇదేదో దారిన పోయే దానయ్య చేసిన ప్రకటన అయితే ఎవ్వరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గత ఎన్నికల్లో జగన్ కు విజయం దక్కించిన వ్యూహాల రూపకర్తగా అందరూ భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పిన మాట కావడంతో సంచలనచర్చ జరుగుతోంది.

అయితే జగన్ పాలన పట్ల నిజంగానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదా? లేదా, ఈ వ్యూహకర్త అయిదేళ్లలోనే ప్లేటు ఫిరాయించి.. ప్రజల ఆలోచనలను దారిమళ్లించడానికి ఇలాంటి స్టేట్ మెంట్ ఇస్తున్నారా? అనేది ఇప్పుడు చాలా మందికి కలుగుతున్న అనుమానం.

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సాధించిన విజయాల కంటె.. సాధించిన క్రేజ్ ఎక్కువ. ఎన్నికల వ్యూహాల కాంట్రాక్టులు పుచ్చుకున్న ప్రతిపార్టీని ఆయన గెలిపించిన చరిత్ర ఏమీ లేదు. కాకపోతే.. గెలుపు సాధించిన వాటి గురించి ఎక్కువ ప్రచారం చేసుకుంటూ కీర్తి సంపాదించారనేది చాలా మంది చెప్పేమాట. ఏదైతేనేం.. గత ఎన్నికల్లో జగన్ కు విజయం కట్టబెట్టిన వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. ఇప్పటివరకు కూడా ఆయన టీమ్స్ ఏపీలో పనిచేస్తూనే ఉన్నాయని, ఆయన టీమ్స్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి మార్పుచేర్పులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా చాలా ప్రచారం ఉంది.

అయితే ఇక్కడ ఒక కీలక పరిణామాన్ని గమనించాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ ను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి మరీ.. చంద్రబాబునాయుడు ఆంతరంగికంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో.. తమ పార్టీకోసం వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సిందిగా చంద్రబాబు కోరారని ప్రచారం జరిగింది. అయితే, తాను ఇప్పుడు ఎన్నికల ప్రచారకార్యక్రమాలు చేయడం లేదని చెప్పేశానని, ఆయన పిలిచారు గనుక వచ్చానని భేటీ తర్వాత పీకే మీడియాకు చెప్పారు.

అయితే ఇప్పుడు హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పీకే మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నారని చెప్పడం చూస్తోంటే.. ఇందులో ఏదో మర్మం ఉండవచ్చునని సామాన్యులకు అనుమానం కలుగుతోంది. ఓటర్లలో గెలిచే పార్టీకి ఓటు వేద్దాం అనుకునే వాళ్లు నిర్ణీత పర్సంటేజీ ఉంటారు. అలాంటి వారిని ప్రభావితం చేయడానికి చంద్రబాబునాయుడు, ఇటీవలి భేటీలో ప్రశాంత్ కిశోర్ ను ఇలా చెప్పాల్సిందిగా పురమాయించారా? ఆయన ఇప్పుడు సరైన తరుణం చూసి అలా మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.

ఎందుకంటే.. ఆయన బృందాలే జగన్ కోసం పనిచేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం పొరబాట్లు చేస్తూ ఉంటే గనుక.. వారు ఇన్నాళ్లలో చెప్పి ఉండాలి.. అలాంటిదేం లేకుండా.. ఎన్నికలు వచ్చేశాక.. పాలన బాగాలేదు ఓడిపోతారు అనడం అంటే.. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్లు బృందాలు వందల కోట్ల రూపాయల ఫీజులు తీసుకుని మోసం చేసైనా ఉండాలి? లేదా, చంద్రబాబునాయుడు ప్రేరణతో ప్రశాంత్ కిశోర్ ఇలాంటి మాటల గారడీ చేస్తుండాలి.. అని ప్రజలు భావిస్తున్నారు.