బాలయ్య అల్లుడుకి బదులు అక్కకు సీటు?

విశాఖ ఎంపీ టికెట్ విషయంలో బీజేపీ టీడీపీల మధ్య ఒక రాజకీయ  దాగుడుమూతలు సాగుతున్నాయని అంటున్నారు. విశాఖ ఎంపీ టికెట్ ని టీడీపీ తానే తీసుకోవాలని చూస్తోంది. విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బాలయ్య చిన్నల్లుడు…

విశాఖ ఎంపీ టికెట్ విషయంలో బీజేపీ టీడీపీల మధ్య ఒక రాజకీయ  దాగుడుమూతలు సాగుతున్నాయని అంటున్నారు. విశాఖ ఎంపీ టికెట్ ని టీడీపీ తానే తీసుకోవాలని చూస్తోంది. విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ని ఎంపిక చేసినట్లే అని ప్రచారం సాగుతోంది. శ్రీ భరత్ సైతం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఇపుడు బీజేపీతో పొత్తుల వల్ల ఈ సీటు విషయంలో పీటముడి పడుతోంది. బీజేపీ విశాఖ సీటు కావాలని కోరుతోంది. ఈ సీటు నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన సెంటిమెంట్ ఆ పార్టీది. పైగా ఏపీలో చూస్తే కొద్దిగా బలం ఉన్న జిల్లాగా విశాఖ ఉంది. దాంతో మరోసారి గెలిచేందుకు విశాఖనే ఎంచుకుంటోంది.

టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటుని ఆ పార్టీకి ఇచ్చి విశాఖ నుంచి టీడీపీ పోటీ చేయాలని చూస్తోంది. బీజేపీ కోరితే అరకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. కానీ బీజేపీ విశాఖ సీటే కావాలని కోరడంతో అనకాపల్లి ఎంపీ సీటుని టీడీపీ తిరిగి తీసుకుంటోందని అంటున్నారు. దాంతో మెగా బ్రదర్ నాగబాబుకు వేరే ఎంపీ సీటు చూపిస్తారు అని అంటున్నారు.

విశాఖ ఎంపీ సీటు టీడీపీకి దక్కకపోయినా తమ కుటుంబం లోని వారికే దక్కాలన్న వ్యూహంతో అధినాయకత్వం కొత్త ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. ఈ సీటుకు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తిగా ఉన్నారు. ఆమెను రాజమండ్రి నుంచి పోటీ చేయించాలని బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి.

విశాఖ ఎంపీ సీటుని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఇవ్వాలని నిర్ణయించింది అని అంటున్నారు. టీడీపీ మాత్రం బీజేపీకి ఈ సీటు ఇచ్చినా పురంధేశ్వరికే పొత్తులో భాగంగా కేటాయించాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. దాంతో గత నాలుగేళ్లుగా విశాఖలో సొంత ఇల్లు తీసుకుని విశాఖ పౌరుడిగా మారిన జీవీఎల్ ని సైడ్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది.

జీవీఎల్ బీజేపీ హై కమాండ్ కి అత్యంత సన్నిహితులు. ఆయన ఏపీలో టీడీపీ వ్యతిరేక క్యాంప్ లో ఉంటారు అని ప్రచారం ఉంది. పైగా 2014 నుంచి 2019 మధ్యలో ఆయన టీడీపీ మీద విధానపరమైన విమర్శలు చేసి ఉన్నారు. ఆయనకు పొత్తులో టికెట్ ఇవ్వకుండా చిన్నమ్మకు ఇస్తే మాత్రం జీవీఎల్ కి అన్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు.

విశాఖలో జీవీఎల్ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారని అంటున్నారు. ఆయన కూడా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. మరి జీవీఎల్ కి ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే ఎక్కడ ప్లేస్ మెంట్ చూపిస్తారు అన్నది చూడాలి.