ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎలమంచిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2004లో వైఎస్సార్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం గెలిచారు. 2009లో రెండవసారి గెలిచి వచ్చారు. విభజన తరువాత 2014లో టీడీపీలోకి వెళ్ళినా టికెట్ దక్కలేదు. 2019లో వైసీపీలో చేరి టికెట్ అందుకుని మూడవసారి గెలిచారు. ఈసారి ఎలమంచిలిలో సామాజిక సమీకరణలో భాగంగా కాపులకు టికెట్ ఇస్తారు అని ప్రచారం సాగింది.
కానీ సర్వేలలో చూస్తే కన్నబాబురాజుకే మొగ్గు కనిపించింది. ఆయనకు నియోజకవర్గంలో పట్టు ఉంది. దాంతో ఆయనే సమర్ధుడైన అభ్యర్ధి అని హై కమాండ్ భావిసోంది. ఒక దశలో కాపు సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ని పోటీ చేయించాలని చూశారు. కానీ ఇపుడు కన్నబాబురాజుకే టికెట్ అన్నది అనధికారికంగా ఖరారు అయిపోయింది.
అయితే రాజు గారు మాత్రం తనకు బదులుగా తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్ పర్సన్ సుకుమారవర్మకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జనసేన టీడీపీ కలసినా ఎలమంచిలిలో వైసీపీని ఓడించలేరని అన్నారు. ఇది ఆయన సొంతంగా జనంలో ఉంటూ చేసుకున్న సర్వే అని చెబుతున్నారు.
వైసీపీ పధకాలు చేరని కుటుంబం లేనేలేదని అంటున్నారు. ఎవరు వచ్చినా ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎలమంచిలిలో మళ్ళీ వైసీపీ గెలిచి తీరుతుందని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తన కుమారుడు సుకుమారవర్మకు ప్రజలలో ఆదరణ ఉందని కూడా చెబుతున్నారు.
తన కుమారుడికి టికెట్ తీసుకుని ఈసారి పోటీ చేయించాలని రాజు గారు ఆలోచిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సీనియర్లనే పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. అందుకే ఉత్తరాంధ్రాకు చెందిన ఒక మంత్రి కుమారుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇపుడు కన్నబాబు రాజుకు మినహాయింపు ఉంటుందా అన్నది చూడాలి. రాజు గారు అయితే తాను తప్పుకుని కొడుకుని ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు.