‘దేశం’-’సేన’ జాబితాకు మార్పులు చేర్పులు

చంద్రబాబు వ్యవహారం ఎలా వుంటుంది అంటే ఆయన ఒకటి డిసైడ్ అవుతారు. కానీ అది బయటకు చెప్పరు. సర్వేలు, సమాలోచనలు, ఇలా చాలా అంటే చాలా చేస్తారు. చివరకు వెళ్లి వెళ్లి ఆయన అనుకున్న…

చంద్రబాబు వ్యవహారం ఎలా వుంటుంది అంటే ఆయన ఒకటి డిసైడ్ అవుతారు. కానీ అది బయటకు చెప్పరు. సర్వేలు, సమాలోచనలు, ఇలా చాలా అంటే చాలా చేస్తారు. చివరకు వెళ్లి వెళ్లి ఆయన అనుకున్న దగ్గరకు వచ్చేలా చేస్తారు. అది తెలుగుదేశం సీట్ల కేటాయింపు అయినా, పెట్టుకునే పొత్తులు అయినా కూడా. ఆయన సంగతి తెలియక, ఎక్కడో మొదలెడతారు. ఆఖరికి ఆయన మాట దగ్గరే తేల్తారు.

తెలుగుదేశం తరపున ఎవరు, ఎక్కడ పోటీ చేయాలి, జనసేనకు ఏయే సీట్లు ఇవ్వాలి, అక్కడ కూడా ఎవరు పోటీ చేయాలి ఇవన్నీ ఎప్పుడో చంద్రబాబు డైరీలో ఫిక్స్ అయిపోయాయని రాజకీయ వర్గాల బోగట్టా. కానీ అలా డిస్కషన్లు, సమావేశాలు సాగుతూ వుంటాయంతే.

అయితే ఇటీవల తెలుగుదేశం సీట్లు, జనసేన సీట్లు ప్రకటించిన తరువాత ఈ వ్యవహారానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీనికి రెండు కారణాలు ఒకటి. జనసేన ఫాలోవర్స్ లో వచ్చిన రియాక్షన్. మరొకటి తెలుగుదేశం కేడర్ లో వ్యక్తమవుతున్న అసంతృప్తి. ఈ రెండు మాత్రమే కాదు, మరో సమస్య కూడా వచ్చిందని తెలుస్తోంది.

ఎన్ డి ఎ చేరే నిర్ణయం తీసుకుంటామని చెప్పి, భాజపాతో కలిసి వెళ్లే ఆలోచన చేసి, ఆ పార్టీని అస్సలు సంప్రదించకుండా టికెట్ లు అనౌన్స్ చేయడం. ఈ విషయం భాజపా అధిష్టానం దృష్టికి వెళ్లడం, వారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే విషయాన్ని పక్కనపెట్టడం జరిగిపోయిందని తెలుస్తోంది.

రెండు మూడు రోజులు టెన్షన్ పెట్టి కానీ భాజపా ఏ నిర్ణయం తీసుకునే ఆలోచనలో లేదని తెలుస్తోంది. నిజానికి చంద్రబాబు ఆలోచన ఏమిటంటే తాము టికెట్ లు కొన్ని ప్రకటిస్తే భాజపా తొందరపడి లైన్ లోకి వస్తుందనుకున్నారు. అందుకే జనసేన సీట్లను ప్రకటించకుండా ఆపారు. భాజపా కనుక చర్చలకు వస్తే జనసేన సీట్లు తగ్గడమో, మారడమో తప్పదు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన రివర్స్ అయింది. అందువల్ల తెలుగుదేశం మలి జాబితా ఫ్రకటించడం అన్నది మరి కాస్త ఆలస్యం అయ్యేలా వుంది.

కేవలం భాజపా వైపు నుంచి కాకుండా జనసేనకు కేటాయించిన సీట్ల వైపు నుంచి కూడా సమస్య వుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటివి జనసేనకు కేటాయించడం మీద తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి ఎదురవుతోంది. అలాగే తామరతంపరగా వేరే పార్టీల నుంచి వస్తున్నవారిని తీసుకుని, సీట్లు కేటాయిస్తే సహించమనే మాట కూడా నాయకుల నుంచి వినిపిస్తోందట. దాంతో ఇంతకు ముంతే తయారుచేసి పెట్టుకున్న జాబితాకు మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి.

అటు భాజపా సంగతి తేలాలి. ఇటు జనసేన సంగతి చూడాలి. వలస వచ్చిన వారిలో ఎందరికి టికెట్ లు అన్నది తేలాలి. అప్పుడు కానీ తేదేపా, జనసేన మలి జాబితా బయటకు రావడం కష్టం అని తెలుస్తోంది.

చంద్రబాబు ఓ పక్క యాత్రలు చేస్తుంటే లోకేష్ ఈ జాబితా మీదనే కసరత్తు చేస్తున్నారట. చంద్రబాబుతో ఓ పక్క డిస్కషన్ చేస్తూ, పార్టీ నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటూ లోకేష్ జాబితా ను రఫ్ గా తయారుచేస్తే, అప్పుడు బాబుగారు ఫైనల్ చేస్తారన్నమాట.

అవును…ఇంతకీ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఆయనకు స్వంత యాత్రలూ లేవు. సినిమాలూ చేయడం లేదు. పార్టీ సమావేశాలు నిర్వహించడం లేదు.. ఇంతకీ ఏం చేస్తున్నట్లు?