తెలుగు హీరోలు పైకి ఎన్ని చెప్పినా మాస్ సినిమాను వదలరు. అందులోనూ ఊరమాస్ సినిమాలు అంటే ఇష్టపడే వారు కూడా వున్నారు. కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటే చాలు ఇక మామూలు సినిమాలు తమకు పనికిరావు అనుకుంటారు.
కానీ వాళ్లకు హిట్ లు అంటూ వస్తే అన్నీ రసాలు కలిసిన సినిమానే తప్ప,కేవలం మాస్ సినిమా అయితే కాదు. కొందరు ఇదంతా గమనించి అటు ఇటు తలో సినిమా చేస్తుంటారు. కానీ ఓ యువ హీరో మాత్రం తనకు ఊర మాస్ సినిమా కథలు తప్ప మరోటి వద్దని చెబుతున్నాడట. ఇప్పటికే ఇలాంటి సినిమాలు చేసి రెండు ఫ్లాపులు తన జాబితాలో వేసుకున్నాడు.
సదరు హీరోకి కథ చెప్పాలంటే, దగ్గర బంధువు ఒకరికి ముందుగా చెప్పాలి. ఆయనకు కాస్త టేస్ట్ వుంది. కానీ ఆయన మాట చెల్లడం లేదట. ఇటీవల ఓ ఫీల్ గుడ్ డైరక్టర్ ఓ మంచి కథ ఆ హీరో కోసం తీసుకెళ్తే, ఆ బంధువు అబ్బే వద్దు అన్నాడట. వద్దని చెప్పేయకుండా, వాడేదో ఊర మాస్ సినిమాల కోసమే చూస్తున్నాడు. ఇలాంటి కథలు నప్పవు, వదిలేయండి..మనమేం చెప్పలేం అని కాస్త నిర్వేదంగా అన్నాడట. వాడు ఆ సినిమాలే చేసుకుంటాడు, ఫ్లాపులైనా అవే సబ్జెక్ట్ లు కావాలి అని ఫీల్ గుడ్ కథల దర్శకుడిని వెనక్కు పంపించాడట.
కాస్త క్రేజ్ వున్న హీరో కావడంతో ఆఫర్లకు సమస్య లేదు. రెమ్యూనిరేషన్ కు సమస్య లేదు. అందుకే తనకు అలాంటి మాస్ కథలే కావాలని పట్టుదలగా వున్నాడు. మరో రెండు డిజస్టర్లు పలకరిస్తే అప్పుడు మారతాడేమో?