నాడు నరరూప రాక్షసుడని విమర్శించి, నేడు అదే నాయకుడి మద్దతును టీడీపీ తీసుకుంది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబును టీడీపీ దగ్గరికి తీసుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. నాడు దుర్మార్గుడిగా విమర్శించి, నేడు రాజకీయ అవసరాల కోసం కలుపుకెళ్లడం ఏంటని అమాయక టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు (జయచంద్రారెడ్డి) ఎట్టకేలకు మనసు విప్పారు. సీకే ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో అనే చర్చకు తెరపడింది. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన అనుచరులు టీడీపీ అభ్యర్థి విజయం కోసం పని చేయాలని ఆయన కోరారు. ఎన్నికల తరుణం కావడంతో సీకే బాబు రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చారు.
నాలుగు సార్లు చిత్తూరు నుంచి సీకే బాబు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఒకసారి ఆయన ఇండిపెండెంట్‌గా కూడా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో చిత్తూరులో టీడీపీకి చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని హత్య చేసి, దహనం చేసిన కేసులో సీకే బాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే జరిగింది. సీకే బాబు అరాచకాలపై నాడు పోరాటం చేసిన వారే, నేడు మద్దతు కోరడం గమనార్హం.
పదేళ్లుగా ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ రాజకీయ తెరపైకి వస్తున్న సీకే బాబు భవిష్యత్ కార్యాచరణ ఎలా వుంటుందో అనే చర్చ జరిగింది. చిత్తూరులో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సీకే బాబు, తన మనసులో మాట బయట పెట్టారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తన వాళ్లంతా ఆయనకే అండగా నిలవాలని ఆయన కోరారు.
వైసీపీ తరపున విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో ఆయన ముందంజలో ఉన్నారు. సీకే బాబు టీడీపీలో చేరడం వల్ల బలిజలంతా టీడీపీకి దూరమవుతారనే చర్చ నడుస్తోంది. తమకు కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన జగన్‌మోహన్‌కు టికెట్ ఇవ్వడంపై బలిజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు సీకే బాబు టీడీపీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో బలిజల వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.