షాకింగ్.. ‘ఆహా’ యాప్ పై గూగుల్ దెబ్బ

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆహా ఓటీటీ. ఇప్పుడీ యాప్ కు మరో దెబ్బ తగిలింది. గూగుల్ సంస్థ, తమ యాప్ స్టోర్ నుంచి ఆహా యాప్ ను తొలిగించింది. ప్రస్తుతం యాప్ స్టోర్…

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆహా ఓటీటీ. ఇప్పుడీ యాప్ కు మరో దెబ్బ తగిలింది. గూగుల్ సంస్థ, తమ యాప్ స్టోర్ నుంచి ఆహా యాప్ ను తొలిగించింది. ప్రస్తుతం యాప్ స్టోర్ లో 'ఆహా' కనిపించడం లేదు. కొత్తగా ఎవరైనా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే సాధ్యం కాదు.

ఈమధ్య గూగుల్ తన ప్లే స్టోర్ లో పేమెంట్ పాలసీని మార్చింది. పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్ ను, పాలసీలో నిబంధనలు పాటించని యాప్స్ ను కొన్ని రోజులుగా తొలగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఆహా యాప్ పై కూడా వేటు పడింది.

కేవలం ఆహా యాప్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రముఖ యాప్స్ పై గూగుల్ వేటు వేసింది. ఇందులో ఆల్ట్ బాలాజీ, నౌకరీ డాట్ కామ్, షాదీ డాట్ కామ్, 99 ఏకర్స్, కేరళ మాట్రిమోనీ, కూకు ఎఫ్ఎం, శిక్షా, భారత్ మ్యాట్రిమోనీ లాంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి.

తనకు సరైన సమయం ఇవ్వకుండా, నోటీసు లేకుండా ఇలా యాప్స్ ను తొలిగించడం అన్యాయం అంటున్నారు నౌకరీకి చెందిన ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్ సంజీవ్. మరోవైపు జరిగిన పరిణామాలపై ఆహా కూడా స్పందించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ పోస్టు పెట్టింది.

కొన్ని రోజులుగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ పేమెంట్ పాలసీలపై కొన్ని యాప్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఓసారి స్పందించింది. ఏమైనా సమస్యలుంటే గూగుల్ సంస్థను సంప్రదించాలని, వాళ్లతోనే చర్చలు జరపాలని చెప్పింది. ఇంతలోనే ఈ యాప్స్ అన్నీ ప్లే స్టోర్ నుంచి తొలిగించబడ్డాయి.

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ మార్చి 19న ఉంది. ఈలోగా సదరు సంస్థలన్నీ గూగుల్ తో ఓ ఒప్పందానికి వస్తాయా లేక గూగుల్ విధించిన పేమెంట్ పాలసీలకు అనుగుణంగా మారతాయా.. లేక లీగల్ గానే ఫైట్ చేయడానికి మొగ్గుచూపుతాయా అనేది చూడాలి.