ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. తాజాగా డోన్ నియోజకవర్గం టీడీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఇవాళ చంద్రబాబునాయుడికి గట్టి షాక్ ఇచ్చారు. డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏర్పాటు చేసిన జెండాల్లో దివంగత ఎన్టీఆర్‌తో పాటు సుబ్బారెడ్డి ఫొటోలు మాత్రమే ఉన్నాయి.
చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్‌కల్యాణ్ ఫొటోలు లేకుండా ర్యాలీ నిర్వహించడంతో సుబ్బారెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. ఏపీలో చంద్రబాబు మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి. ఇక్కడి నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎలాగైనా బుగ్గనను ఓడించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డే డోన్ నుంచి పోటీ చేస్తారని బహిరంగ సభలో చంద్రబాబు ఎంతో ముందుగా ప్రకటించారు. అప్పటి నుంచి సుబ్బారెడ్డి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని డోన్ నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వస్తున్నారు. తీరా ఎన్నికల సమయానికి సుబ్బారెడ్డికి బదులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. దీంతో సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
డోన్‌లో శుక్రవారం కేఈ కృష్ణమూర్తి కుటుంబంతో కలిసి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ధర్మవరం సుబ్బారెడ్డి దూరంగా ఉన్నారు. ఆ ర్యాలీకి పోటీగా సుబ్బారెడ్డి ఇవాళ భారీ ర్యాలీ చేపట్టి చంద్రబాబుకు హెచ్చరిక పంపారు. కనీసం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ ఫొటోలు లేకుండా ధర్మవరం సుబ్బారెడ్డి జాగ్రత్తలు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రానున్న ఎన్నికల్లో సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా లేదా కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతారనే చర్చకు తెరలేచింది. ఏది ఏమైనా డోన్‌లో రాజకీయ పరిణామాలు చంద్రబాబుకు కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు.