వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. మేనిఫెస్టో విడుదలపై వైసీపీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ నెల 10న నాల్గో, చివరి సిద్ధం సభలో మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ విడుదల చేస్తారని ఆయన చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధం సభ వివరాలు వెల్లడించారు.
మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన చివరి సిద్ధం సభను 100 ఎకరాల్లో 15 లక్షల మందితో నిర్వహిస్తామన్నారు. ఈ సభ వేదికగా వచ్చే ఎన్నికల్లో తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తే ఏం చేస్తామనో మేనిఫెస్టో ద్వారా వివరిస్తామన్నారు. ఈ సభ అనంతరం వైసీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందన్నారు.
ఇప్పటి వరకు జరిగిన మూడు సిద్ధం సభలను చూస్తే, మరోసారి వైసీపీనే తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్ సంక్షేమ పాలన చూసి బీసీలు తమ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు.
ఇదిలా వుండగా వైసీపీ మేనిఫెస్టోపై ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గతంలో నవరత్నాల సంక్షేమ పథకాల పేరుతో జగన్ అన్ని వర్గాలను ఆకట్టుకుని తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఏ పార్టీకైనా మేనిఫెస్టో కీలకమైంది. జగన్ ఏదైనా చెబితే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో వుంది. ఈ నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి ఆకర్షణీయమైన పథకాలు ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో వుంది. ఈ దఫా రైతు, డ్వాక్రా రుణాల మాఫీ వుంటుందని ప్రచారమవుతోంది. అదే జరిగితే వైసీపీ కొన్ని వర్గాల ఓట్లను గంపగుత్తగా పొందుతుందనే చర్చ జరుగుతోంది.