Advertisement

Advertisement


Home > Movies - Reviews

Vyooham Review: మూవీ రివ్యూ: వ్యూహం

Vyooham Review: మూవీ రివ్యూ: వ్యూహం

చిత్రం: వ్యూహం
రేటింగ్: 1.5/5
తారాగణం:
అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, వాసు ఇంటూరి, సురభి ప్రభావతి, ఎలీనా టుటేజా, ధనంజయ్ ప్రభునే తదితరులు
ఎడిటింగ్: మనీష్ ఠాకూర్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
దర్శకత్వం: రాం గోపాల్ వర్మ
విడుదల: 1 మార్చ్ 2024

ఆర్జీవీ చిత్రాలంటేనే వివాదాలతో ముడిపడి ఉంటాయి. సెన్సార్ చిక్కుల్ని తేలిగ్గానే దాటినా, కోర్టు కేసులు మాత్రం ఈ చిత్రాన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. జనవరిలోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ రోజు విడుదలయింది. 

రాజకీయ చిత్రాలు కామన్. అవి చాలా మంది తీస్తారు. కానీ ఆర్జీవీ తీసే రాజకీయ చిత్రాలు మిగిలిన వాటి కంటే ఎక్కువ ప్రచారం పొందుతాయి. దానికి కారణం న్యూసెన్స్ వేల్యూ, మొహమాటం లేని సెటైర్ డైలాగులు, అన్నిటికీ మించి లుక్-అలైక్ ఆర్టిస్టులు.

గతంలో "లక్ష్మీస్ ఎన్.టి.ఆర్", "అమ్మరాజ్యంలో కడప బిడ్డలు" తీసినా వాటిల్లో మొదటిది ఏకపక్ష కథనం గానూ, రెండోది అగమ్యగోచరంగానూ తేలాయి. ఇక ఈ ఎన్నికల ముందు వచ్చిన "వ్యూహం" పరిస్థితి ఏంటో చూద్దాం.

కథగా తీసుకుంటే వై.ఎస్.ఆర్ మరణంతో మొదలయ్యి వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో ముగుస్తుంది. 

వై.ఎస్.ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలగానే చంద్రబాబు ఆనందం, కానీ జగన్ ఎదుగుతాడనిపించినప్పుడు భయం, ఆ భయంతో చేసే కుట్ర, తన అవసరానికి పవన్ కళ్యాణ్ ని వాడుకోవడం, చివరికి జగన్ ప్రభంజనంలో తన ఉనికి కోల్పోతున్నందుకు కొడుకుతో పాటు ఏడవడం...ఇదీ ఈ చిత్రంలో చంద్రబాబు పాత్ర తాలూకు గ్రాఫ్. 

ఇందులో చంద్రబాబు కంటే ప్రధానంగా ఆకట్టుకున్న పాత్ర పవన్ కళ్యాణ్ దే. ఒక అమాయక చక్రవర్తిలాగ, తన గురించి తాను అతిగా ఊహించుకునే తెలివతక్కువ వాడిలాగ చిత్రీకరించాడు పవన్ ని. 

ఒకరకంగా చూస్తే, గతంలో "పవర్ స్టార్" పేరుతో ఆర్జీవీ తీసిన ఓటీటీ చిత్రానికి ఈ క్యారెక్టర్ కొనసాగింపులా ఉంది. గేదెలతో తన ఓటమి బాధ చెప్పుకోవడమనే ఇందులో ఉన్న ఒక సీన్ అందులోనూ ఉన్నదే. అయితే ఆ పవన్ పాత్రధారి ఈ "వ్యూహం" లో పవన్ పాత్రధారికంటే చూడడానికి మరింత కన్విన్సింగ్ గా ఉన్నాడు. 

"అమ్మరాజ్యంలో కడపబిడ్డలు" మాదిరిగా అభూత కల్పనలు కాకుండా బయట వార్తల్లో చలామణీలో ఉన్న అంశాలకే సినిమా రూపమిచ్చినట్టు ఉంది ఈ "వ్యూహం". 

ఆర్జీవీ సినిమాల్లో నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవడం అనవసరం. కంటెంట్ గురించే ఏమన్నా మాట్లాడుకునేదుంటే మాట్లాడుకోవాలి. 

ఈ మధ్యనే వచ్చిన "యాత్ర 2" కి ఈ "వ్యూహం" కి కథ నడిచే టైం లైన్ లో తేడా ఏమీ లేదు. అయితే యాత్ర 2 లో సీరియస్నెస్ పాళ్లు ఎక్కువగా ఉంటే ఇందులో కామెడీ సెటైర్లు ఎక్కువ. అందులో వై.ఎస్.ఆర్, జగన్ ల గొప్పదనం చూపించడం మీద దృష్టి ఎక్కువ పెడితే ఇందులో పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని వ్యంగ్యంగా ఆడుకోవడం మీద దర్శకుడు విల్లు ఎక్కుపెట్టడం జరిగింది. ఆ రకంగా ఇందులో వినోదం పాళ్లు ఎక్కువే.

అయినప్పటికీ ఇందులో మైనస్సులు లేకపోలేదు. ముఖ్యంగా వైకాపా శ్రేణుల్లోనో, జగన్ కుటుంబ సభ్యులనో సంతుష్టపరచడానికన్నట్టుగా ఉన్న కొన్ని సన్నివేశాలు ఆ వర్గం వాళ్లకే అతిగా అనిపిస్తాయి. జగన్-భారతి మధ్య సంక్షేమం-అభివృద్ధి టాపిక్స్ మధ్య ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎక్కడా బ్రివిటీ లేకుండా సుదీర్ఘంగా సాగే ఆ సన్నివేశం పూర్తియ్యే సరికి భారతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమయిందని జగన్ అడిగితే అవి ఆనందబాష్పాలంటుంది. ఇద్దరూ కౌగిలించుకుంటారు. అసలీ సన్నివేశం జగన్-భారతిలను ఎలివేట్ చేసేలా లేకపోగా వాళ్ల మీద సెటైర్ లాగ ఉంది.

అలాగే ఎన్నికల్లో దెబ్బతిన్నందుకు చంద్రబాబు తన కొడుకుతో కలిసి ఎన్.టి.ఆర్ పటం ముందు నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఈ సీన్ వైకాపా వారిని నవ్వించడానికి పెట్టినా వాళ్లు కూడా పెద్దగా మెచ్చేలా లేదు. 

జగన్ గా నటించిన అజ్మల్ గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లో కనిపించినతనే. జగన్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా ఔపోసన పట్టాడు కానీ చంద్రబాబు పాత్రలాంటి లుక్ అలైక్ మాత్రం కాదు.

భారతి పాత్రధారి బానే ఉంది. షర్మిల పాత్ర కనిపించింది తప్ప పెద్దగా చెప్పుకునే విధంగా ఆమె పాత్రను మలచలేదు. 

చంద్రబాబు పాత్రధారి ధనంజయ్ ప్రభునే మాత్రం ఆర్జీవీకి అంకితమైపోయినట్టున్నాడు. ఆర్జీవీ సినిమాల్లో ఈ పాత్రలో తప్ప అతను ఇంకెక్కడా కనపడలేదు. అలాగని వేరే సిన్మాల్లో కూడా ఎప్పుడూ కనిపించిన దాఖలాల్లేవు. పదే పదే ఇతన్ని చూస్తే అసలు చంద్రబాబు మొహం గుర్తురావడానికి కూడా టైం పడుతుంది. ఏ సత్రం నుంచో ఇతన్ని పట్టి తెచ్చి, ట్రైనింగ్ ఇచ్చి నటింపజేయడం ఆర్జీవీకే చెల్లింది.

లోకేష్ పాత్ర వినిపిస్తుంది తప్ప కనిపించదు. అతనినొక తెలివితక్కువ తిండిబోతుగా ప్రొజెక్ట్ చేసారిందులో. పవన్ తర్వాత నవ్వించిన పాత్ర ఇదే. 

టెక్నికల్ గా చూసుకుంటే సంగీతం విషయంలో వై.ఎస్.ఆర్ అంత్యక్రియల పాట ఒక్కటీ సౌండింగ్ పరంగా రిచ్ గా ఉంది. సాహిత్యం మాత్రం అర్ధమయ్యీ అర్ధం కాని డబ్బింగ్ పాటలా ఉంది. వై.ఎస్.ఆర్.సి.పి...అంటూ సాగే పాట ఫక్తు ఎలక్షన్ సాంగ్ లా ఉంది. ఏ పాట గురించీ చెప్పుకోవడనికి ఏమీ లేకుండా ఉంది . సంభాషణలు కొన్ని బాగా పేలితే, కొన్ని మరీ చాంతాడంత ఉన్నాయి! 

ఈ కథని యాత్ర2 లో చూసిందే కనుక అసలు కథంతా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుని ఎలా ట్రీట్ చేసాడు అనేదాని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బహుశా అది 'శపథం' లో ఉన్నట్టుంది. షర్మిల తిరుగుబాటు, బీజేపీ ప్రస్తావన అందులో ఉంటాయేమో చూడాలి. ఇందులో మాత్రం అవి లేవు. 

వైసీపీ సానుభూతిపరులకి ఈ వ్యూహం నవ్వుల పంటైతే, తెదేపా-జనసేన కూటమి అభిమానులకి మాత్రం ఒళ్లుమంటగా నిలుస్తుంది. కనుక ఇది వైసీపీ అభిమానులకి వినోదభరిత రాజకీయ చిత్రంగానూ, ప్రత్యర్ధులందరికీ విషాదభరిత చిత్రవధగానూ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. 

బాటం లైన్: వాళ్లకి వినోదం- వీళ్లకి విషాదం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?