మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు అనుకుంటే, రివర్స్‌లో ఆయనే ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై గంటాను నిలపాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు. తద్వారా గంటా రాజకీయ జీవితానికి ముగింపు పలకాలనేది చంద్రబాబునాయుడి వ్యూహం. దీనికి బలమైన కారణం లేకపోలేదు.
టీడీపీ అధికారం కోల్పోగానే.. గంటా శ్రీనివాసరావు అంటీముట్టనట్టు వున్నారు. ఒక దశలో వైసీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే గంటాను చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తి చూపలేదని అప్పట్లో చర్చ జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గంటా మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్ అయ్యారు. సొంత పార్టీ టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.
ఇందులో భాగంగా చంద్రబాబునాయుడు, లోకేశ్‌లతో సఖ్యత కోసం ఆసక్తి చూపారు. బలహీనంగా వున్న టీడీపీ… గంటాను దగ్గరికి తీసుకున్నట్టే కనిపించింది. ఇదే సందర్భంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు చంద్రబాబునాయుడు సూచించారు. దీంతో గంటా ఆశ్చర్యానికి లోనయ్యారు. విశాఖ జిల్లా పరిధిలో ఎక్కడైనా తనకు సీటు ఇవ్వాలని గంటా విజ్ఞప్తిని చంద్రబాబు తిరస్కరించారు.
దీంతో పొమ్మనకుండా పొగ పెడుతున్నారని గంటాకు అర్థమైంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి పోటీ చేయకూడదని గంటా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని తేల్చి చెప్పాలని ఆయన సిద్ధమయ్యారు. వీలైతే విశాఖ జిల్లాలో టికెట్ ఇవ్వాలని అడిగి, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో గంటా నిమగ్నమయ్యారు. తద్వారా బాబుకు రిటర్న్ షాక్ ఇవ్వాలని గంటా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇప్పటికే వైసీపీతో గంటా మాట్లాడుకున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. విశాఖ జిల్లాలో బలమైన నాయకుల అవసరం వైసీపీకి వుంది. గంటాను చేర్చుకుని ఆయన కోరుకున్న సీటు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.