ఒకవైపు ఎన్నికలు తరముకొస్తున్నాయి. మరోవైపు ఏపీలో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ డెయిలీ సీరియల్‌ను తలపిస్తోంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తుపై టీడీపీ-జనసేన కూటమికి స్పష్టత లేదు. అసలు పొత్తు వుంటుందో, వుండదో బీజేపీ తేల్చి చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన రోజురోజుకూ ఆలస్యమవుతోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది.
అభ్యర్థులను మార్చే చోట సీఎం వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. టీడీపీ-జనసేన కూటమిలో భాగంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 76 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల పరిధిలో అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. ఇది ఇప్పుడిప్పుడే తేలేలా కనిపించడం లేదు.
దీంతో టీడీపీ, జనసేన నాయకులు అయోమయానికి లోనయ్యారు. టికెట్ వస్తుందో , రాదో తెలియని పరిస్థితిలో అనవసరంగా కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచన వాళ్లందరి అడుగులకు అడ్డు కట్ట వేసింది. ఏదో మొక్కుబడిగా క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నేతలు కనిపిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నాయకులు టికెట్‌పై క్లారిటీ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని అంటున్నారు.
ఫలానా నియోజకవర్గం టీడీపీ లేదా జనసేనకు ఇస్తారట అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరు పార్టీల నాయకుల్లో టికెట్‌పై అనుమానాలున్నాయి. అసలు చంద్రబాబు, పవన్ మనసుల్లో తమ నియోజక వర్గాలపై ఏ అభిప్రాయం వుందో తెలుసుకోడానికి ఇరు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. 76 నియోజకవర్గాల్లో ఏ సీటు ఎవరికి వస్తుందో అర్థం కాని పరిస్థితిలో నాయకులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
జనసేనకు కేటాయించిన 24 సీట్లలో ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. వాటిపై ఉత్కంఠ నెలకుంది. టీడీపీకి సంబంధించి బీజేపీతో పొత్తు వస్తే తప్ప, మిగిలిన సీట్లపై స్పష్టత రాదని అంటున్నారు. ఇవన్నీ తేలే సరికి వైసీపీ ప్రచారంలో దూసుకెళుతుందనే ఆందోళన ఇరుపార్టీల నేతల్లో వుంది.