‘చెల్లెలి కోరిక’తో సత్యకుమార్ సెల్ఫ్ గోల్!

పొద్దున లేచిన దగ్గరి నుంచీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడమూ, ఆయనను తిట్టిపోయడమూ ఒక వ్రతంలాగా కొనసాగిస్తుండడం ద్వారా.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు పర్సనల్ గా గానీ, ఆమె ఉన్న పార్టీని…

పొద్దున లేచిన దగ్గరి నుంచీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడమూ, ఆయనను తిట్టిపోయడమూ ఒక వ్రతంలాగా కొనసాగిస్తుండడం ద్వారా.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు పర్సనల్ గా గానీ, ఆమె ఉన్న పార్టీని గెలిపించే దిశగా గానీ ఎంత లాభం ఒనగూరుతుందో చెప్పలేం గానీ.. ఆమె మాటలు జగన్ యొక్క ఇతర రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం అస్త్రాలుగా పనికి వస్తున్నాయి.

‘‘నీ సొంత చెల్లెలే ఇలా అంటోంది..’’ అంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు ప్రతి షర్మిల మాటను చాలా బాగా వాడుకుంటున్నారు. ఇలా షర్మిల మాటలను వాడుకునే వారి జాబితాలోకి తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సత్యకుమార్ చేరుతున్నారు. కాకపోతే ఆయన షర్మిల మాటలను కాకుండా.. సునీత మాటలను జగన్ ను ఇరుకున పెట్టడానికి వాడుకుంటున్నారు.

తన తండ్రి మరణం గురించి సునీత ప్రెస్ మీట పెట్టిన తర్వాత.. ప్రజా కోర్టు తన తండ్రి మరణంపై తీర్పు ఇవ్వాలని అడగడాన్ని సత్యకుమార్ ప్రస్తావిస్తున్నారు. సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేదని పాపం జాలి చూపిస్తున్నారు. దర్యాప్తు సంస్థల విచారణను అడ్డుకుంటూ నిందితులను కాపాడుతున్నారని ఆయన జగన్ మీద నిందలు వేస్తున్నారు.

దర్యాప్తు సంస్థలు అంటే ఇక్కడ ఎవరు? సీబీఐ వారే కదా? మరి సీబీఐ విచారణను జగన్ అడ్డుకోవడం ఎలా జరుగుతోందని సత్యకుమార్ భావిస్తున్నారో.. ఏ ఆధారాలతో అలా అంటున్నారో కూడా చెబితే బాగుంటుంది. సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్థ.. కేంద్రం ఉసిగొల్పినట్టుగా వారి ప్రత్యర్థులమీదికి ఎగబడుతుంటుందని ప్రజల్లో కొన్ని విమర్శలు కూడా ఉంటాయి.

అలాంటి నేపథ్యంలో కేంద్రం ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థను జగన్ అడ్డుకుంటున్నారని అనదలచుకుంటే.. బిజెపి జగన్ తో లోపాయికారీగా కుమ్మక్కయి ఉన్నట్టే లెక్క. ఆ విషయం సత్యకుమార్ ఒప్పుకుంటున్నట్టే ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. ఒకవేళ బిజెపి సాయం లేకుండానే జగన్ సీబీఐ దర్యాప్తును అడ్డుకుంటున్నారని సత్యకుమార్ చెబుతున్నట్లయితే గనుక.. అది కేంద్రప్రభుత్వం యొక్క చేతగానితనం అవుతుంది తప్ప మరోటి కాదు. ఏ రకంగా చూసినా సత్యకుమార్ వ్యాఖ్యలు బిజెపి కేంద్రప్రభుత్వపు పరువు తీసేవిధంగానే ఉన్నాయి.

అయినా కమలనాయకుడు సత్యకుమార్.. సునీత యొక్క ఒక ఆవేదన గురించి, ఆమె చేస్తున్న పితూరీల గురించి మాట్లాడుతూ జగన్ ను నమ్మకూడదని అంటున్నారు. కానీ జగన్ గారి అసలు చెల్లెలు షర్మిల.. భారతీయ జనతా పార్టీ చేసిన మోసాన్ని తీవ్రాతితీవ్రంగా ఎండగడుతోంది. ప్రత్యేకహోదా విషయంలో బిజెపి మరియు మోడీ చేసిన మోసాన్ని తూర్పారపడుతోంది. మరి బిజెపిని మాత్రం ప్రజలు ఎలా నమ్మాలి? ఆ మోసాన్ని ఎందుకు క్షమించాలి? ఆ విషయం కూడా సత్యకుమార్ వివరణ ఇస్తే బాగుంటుంది.