ఏడాది ముందు మొదలుపెట్టి, సంక్రాంతికే తమ సినిమా విడుదల అంటున్నారు మెగాస్టార్. అదే టైమ్ లో మొదలుపెట్టకుండానే తమ సినిమాకు టైటిల్ నే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటున్నారు దిల్ రాజు- అనిల్ రావిపూడి- వెంకటేష్. ఎందుకిలా? సినిమా మార్కెట్ అర్థం అయ్యింది కనుక. నా సామి రంగా కావచ్చు, గుంటూరు కారం కావచ్చు సంక్రాంతికి రాకపోయి వుంటే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ చెబుతున్న పాఠం ఒక్కకటే. సినిమా కంటెంట్ కన్నా కూడా డేట్ కీలకం అన్నదే.
కానీ పాపం చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు ఈ పరిస్థితి లేదు. దొరికిందే డేట్. అలా అని సర్దుకుని విడుదల చేస్తుంటే బాక్సాఫీస్ దగ్గర కనీసం పదిశాతం ఓపెనింగ్ కూడా నోచుకోవడం లేదు. ఫిబ్రవరి మూడో వారం నుంచి మార్చి నెలాఖరు వరకు పరీక్షల సీజన్. అది ఎల్కేజీ కావచ్చు. ఇంజనీరింగ్ కావచ్చు. అటు పేరెంట్స్ బిజీ, ఇటు పిల్లలు బిజీ. మరి సినిమాలకు వచ్చే జనం ఎంత. మంది?
ఈ సంగతి ఆలోచించడం లేదు. ఫిబ్రవరిలో ఫలానా బ్లాక్ బస్టర్ వుంది. మార్చిలో ఫలానా హిట్ వుంది అని తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు. పైగా ఆ చిన్న మిడ్ రేంజ్ సినిమాలకు ఛాయిస్ అస్సలు వుండడం లేదు. గిల్డ్ లాంటి సంస్థలు చిన్న సినిమాలకు కూడా చాన్స్ ఇద్దాం. ఈ నెల మొత్తం వాటికి వదిలేద్దాం అని అనుకోవడం లేదు. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీస్తే మాత్రం సర్దుకుని డేట్ సెట్ చేసుకుంటున్నారు. చిన్న సంస్థ అయితే ఎవరికీ పట్టడం లేదు.
రెండు మూడు నుంచి ఏడెనిమిది సినిమాలు ఒకేసారి అది కూడా అన్ సీజన్ లో వచ్చిపడుతున్నాయి. కొన్ని సినిమాలకు పదిశాతం టికెట్ లు తెగితే, మరి కొన్నింటికి టికెట్ కూడా తెగడం లేదు.
జనవరి, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలను పెద్ద బ్యానర్లు తీసేసుకుంటున్నాయి. ఫిబ్రవరి, జూన్, నవంబర్ నెలలను మిడ్ రేంజ్ సినిమాల ఆక్యుపై చేస్తున్నాయి. ఇక మిగిలింది మార్చి, జూన్, నవంబర్ లాంటి అన్ సీజన్ నెలలే. ఆ నెలలు కూడా పండగలు అటు ఇటు అయితే దొరకవు. ఇక చిన్న, కొత్త బ్యానర్లు చిన్న సినిమాలు తీసి ఏం చేసుకోవాలి?
పెద్ద బ్యానర్లు చేసే చిన్న సినిమాలకు ఈ సమస్య రాదు. కొత్త బ్యానర్లు చేసే చిన్న సినిమాలకే ఈ సమస్య. కొత్త, చిన్న నిర్మాతలకు గిల్డ్ లో ఎంట్రన్స్ తక్కువ. వున్నా మాట చెల్లుబాటు కాదు. అందువల్ల చిన్న, కొత్త నిర్మాతలు తమకంటూ పోరాడేందుకు ఓ గిల్డ్ నో, సంఘాన్నో ఏర్పాటు చేసుకోకుంటే, రాను రాను చిన్న, కొత్త నిర్మాతలు కనుమరుగైపోయే ప్రమాదం వుంది.
ఫిబ్రవరిలో, ఈ తొలి వారంలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి, వాటిలో పదిశాతం కలెక్షన్లు అయినా వసూలు చేసిన సినిమాల ఎన్ని అన్న లెక్కలు తీస్తే పరిస్థితి దారుణంగా వుంటుంది. గమ్మత్తేమిటంటే థియేటర్ల వ్యాపారం అంతా పెద్దల చేతుల్లోనే వుంది. వాటిని పోషించేది, ఆఫ్ సీజన్ లో ఆదుకునేది ఈ చిన్న సినిమాలే. కానీ వాటికి మాత్రం సరైన డేట్ లు ఇవ్వరు, విడుదల వుండదు. బలవంతుడిదే రాజ్యం అనుకోవాలి.
ప్రస్తుతం చిన్న నిర్మాతల చిన్న సినిమాకు థియేటర్ విడుదల ఓ మాండేటరీగా మారింది. కనీసం క్యూబ్ ఖర్చులు కూడా రావని తెలిసినా ఓటిటి సంస్థల కోసం విడుదల చేయాల్సి వస్తోంది. అందుకు తగినట్లు పబ్లిసిటీ చేయాల్సి వస్తోంది. అదంతా వృధా ఖర్చు కింద మిగులుతోంది.