ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ-జనసేన కూటమికి అక్కడి మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే పవన్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్నదో, అది నెరవేరే వాతావరణం కనిపించడం లేదనే మాట బలంగా వినిపిస్తోంది.
ముఖ్యంగా పవన్‌కల్యాణ్ వైఖరితో సొంత సామాజిక వర్గమే అసహనం వుండడం విశేషం. పవన్‌కల్యాణ్ వైఖరికి నిరసరగా జనసేన పీఏసీ సభ్యుడు, ఆ పార్టీ ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా పవన్ వెంట నడుస్తూ, ఆయన సీఎం కావాలని పరితపించిన చేగొండి సూర్యప్రకాశ్ పార్టీ మారారంటే, అక్కడి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జనసేనలో కీలక నాయకుడు వైసీపీలో చేరొచ్చని ప్రచారం ఉభయగోదావరి జిల్లాల్లో ఊపందుకుంది. వైసీపీలో ఆయన చేరితే మాత్రం… జనసేన-టీడీపీ కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. సదరు జనసేన ముఖ్య నాయకుడి సీటుపై పవన్‌కల్యాణ్ క్లారిటీ ఇస్తే, దాన్ని బట్టి నిర్ణయం వుంటుంది. ఒక నియోజకవర్గంపై గ్రీన్ సిగ్నల్, ఆ తర్వాత చంద్రబాబు వద్దన్నాడని, మరో నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించడం జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది.
జనసేన ప్రకటించాల్సిన సీట్లు ఇంకా 19 ఉన్నాయి. అలాగే టీడీపీ 50కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే, వాటి మధ్య పొత్తు ఎంత బలంగా వుందో తెలిసిపోతుందనే చర్చకు తెరలేచింది. జనసేన నాయకుడికి ఇచ్చిన హామీని పవన్ నిలబెట్టుకోలేకపోతే మాత్రం… ఉభయ గోదావరి జిల్లాలో ఆ నాయకుడి ఎఫెక్ట్ తీవ్రంగా వుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ జనసేన కీలక నాయకుడితో ఐ-ప్యాక్ టీమ్ టచ్‌లోకి వెళ్లింది.
వైసీపీలోకి వస్తే ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని ఆయన దృష్టికి ఐ-ప్యాక్ టీమ్ తీసుకెళ్లింది. చాలా కాలంగా పవన్ వెంట నడుస్తున్నానని, సీటు విషయమై న్యాయం చేయకపోతే వైసీపీలో చేరుతాననని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఆ కీలక జనసేన నాయకుడు వైసీపీలో చేరితే… ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ-జనసేన కూటమికి భారీ షాక్ తప్పదనే చర్చకు తెరలేచింది.