ప్రతి పార్టీ ప్రతి సామాజిక వర్గానికి ఎన్నో కొన్ని సీట్లు కేటాయించాల్సిందే. లోకల్ గా వుండే ఓట్ల ఆధారంగా ఇలాంటివి తప్పవు. అయితే ప్రతిసారీ కాపు మీద కాపును, కమ్మ మీద కమ్మను, రెడ్డి మీద రెడ్డిని పోటీకి పెట్టడం కామన్.
కానీ ఈసారి వైకాపాకు ఓక చిత్రమైన పరిస్థితి వుంది. నిజానికి 2019 నుంచి వైకాపా వ్యూహం వేరు. బిసి లను ఎక్కవగా బరిలోకి దింపుతున్నారు. కానీ ఈసారి కొన్ని చోట్ల బిసిల మీద కాపులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. లేదా వైకాపా కాపు అభ్యర్ధులు వున్న చోట్ల తేదేపా బిసిలకు ఇచ్చింది అనేనా అనుకోవచ్చు.
మొత్తానికి వైకాపా కాపు అభ్యర్థులకు, తేదేపా బిసి అభ్యర్ధులకు కొన్ని చోట్ల పోటీ వుండేలా వుంది. అలాంటపుడు పరిస్థితి ఏమిటి అన్నది చూడాల్సి వుంది. ఎందుకంటే 2019లో పవన్ జనసేన తేదేేపాతో లేదు. అప్పుడు కాపు ఓట్లు కొంత వరకు చీలాయి. లేదా తేదేపాకు ఎక్కువగా వెళ్లలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా వుంది. 2019తో పోల్చుకుంటే జనసేనకు ఊపు కనిపిస్తోంది. అలాగే జనసేన ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది.
ఇలాంటి నేపథ్యంలో కాపు ఓట్లు వైకాపా కు ఏమేరకు వస్తాయి. వైకాపా కాపు అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? ఉదాహరణకు తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు వైకాపా తరపున. ఆయన కాపు కులానికి చెందిన వారు. ఆయన మీద బిసి అయిన యనమల రామకృష్ణుడి కుమార్తె పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కాపులు ఎటు ఓటు వేస్తారు. పవన్, జనసేన ప్రభావితమై తెలుగుదేశం పార్టీకి వేస్తారా? లేక తమ వాడు అని రాజా కు వేస్తారా? ఇదే పరిస్థితి మరికొన్ని చోట్ల కూడా వుంది. అనకాపల్లిలో భరత్ కు కొణతాల రామకృష్ణ కు పోటీ ఇలాంటిదే. కాపు ఓట్లు పడక, బిసి ఓట్లు చీలిపోతే వైకాపా పరిస్థితి ఏమిటి?
బిసి అభ్యర్దులు ఇద్దరూ వున్నా కూడా ఇలాంటి ఇబ్బంది వుంటుంది. ఎందుకంటే బిసి ఓట్లు చీలి, కాపు ఓట్లు మెజారిటీగా రాకుంటే ఇబ్బందే. ఈ ఇబ్బందులన్నీ వచ్చింది జనసేన వెళ్లి తేదేపాకు మద్దతుగా నిలవడం వల్ల. ఇందుకోసమే కదా చంద్రబాబు కోరి పవన్ ను తన పక్కన నిల్చునేలా చేయడానికి కిందా మీదా పడ్డారు. మొత్తానికి సాధించారు. ఈ పరిస్థితి చూసుకునే పవన్, నిన్ను పాతాళానికి తొక్కేస్తా అంటూ జగన్ మీదకు వెళ్తున్నారు.
ఈ పరిస్థితుల్లో జగన్ కు మిగిలిన ఆశ అంతా ఒక్కటే కులాలకు అతీతంగా ఓట్లు పడాల్సి వుండడం. పథకాలు అందుకున్నవారు ఏమైనా ఆదుకుంటే ఆ పరిస్థితి వస్తుంది. లేదూ అంటే 2019లో మాదిరిగా బిసిలు పార్టీలకు అతీతంగా జగన్ వెనుక నిలవాల్సి వుంటుంది. అలా కాకుంటే కులాల కుమ్ములాటలో జగన్ ఈసారి వెనుకపడే ప్రమాదం వుంది.