తెలుగు-తమిళ భాషల్లో పాపులర్ నటిగా కొనసాగుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థ వేడుక పూర్తయింది.
గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ముంబయిలో నిన్న ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ ఏడాది చివర్లో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది.
వరలక్ష్మి, నికోలాయ్ సచ్ దేవ్ ఒకరికొకరు 14 ఏళ్లుగా తెలుసంట. ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో వీళ్లు ఉంగరాలు మార్చుకున్నట్టు మాత్రమే వెల్లడించారు. ఇది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన సంబంధమా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ముంబయిలో వ్యాపారకుటుంబానికి చెందిన వ్యక్తి నికోలాయ్. అతడికి ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఇక వరలక్ష్మి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ నటిగా కొనసాగుతోంది. తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
38 ఏళ్ల వరలక్ష్మి శరత్ కుమార్ చాన్నాళ్ల కిందటే పెళ్లి చేసుకోవాల్సింది. నటుడు విశాల్ తో ఆమె డేటింగ్ చేసింది. పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. అంతలోనే వాళ్లు విడిపోయారు. ఎట్టకేలకు వరలక్ష్మి నిశ్చితార్థం చేసుకుంది. విశాల్ ఇంకా సింగిల్ గానే ఉన్నాడు.