సరైన హిట్ ఒక్కటి పడితే ఆరు ఫ్లాపులు వచ్చినా తట్టుకోగలరు మన తెలుగు హీరోలు. కానీ వరుస ఫ్లాపులే పలకరిస్తూ పోతుంటే మార్కెట్ ఎన్నాళ్లు వుంటుంది. అదీ సమస్య. గతంలో కన్నా ఈ సమస్య ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధపెడుతూంది. ఎందుకంటే గతంలో థియేటర్ మార్కెట్ బాగుండేది. యావరేజ్ అయినా ఓ మాదిరిగా కలెక్షన్లు వచ్చేవి. అలాగే నాన్ థియేటర్ మార్కెట్ కూడా ఇంతో అంతో ఆదుకునేది. కానీ ఇప్పుడు వ్యవహారం మొత్తం వేరుగా వుంది. నాన్ థియేటర్ మార్కెట్ సెట్ కావడం ఎప్పటికి అన్నది క్లారిటీ లేదు. సినిమా సూపర్ హిట్ అయితే ఎదురు వచ్చి అడుగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ మార్కెట్ పెరగాలి. సినిమా బాగుంటే ఎలాగూ పెరుగుతుంది. అలా కాదు. ఓపెనింగ్ పెరగాలి. కాంబినేషన్ వుంటే ఓపెనింగ్ వస్తుంది. కానీ చాలా మంది హీరోలు ఇప్పుడు కాంబినేషన్ కొరతతోనే బాధపడుతున్నారు. హిట్ లు లేక, కాంబినేషన్ లు లేకుంటే ఓపెనింగ్ తెగమంటే ఎలా తెగుతుంది. వరుస ఫ్లాపులతో, డిజాస్టర్లతో బాధపడుతున్నవారిలో రవితేజ,గోపీచంద్, శర్వానంద్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, సత్యదేవ్, కిరణ్ అబ్బవరం, నాగశౌర్య తదితరులు వున్నారు. వీళ్లు కాంబినేషన్ కోసం ఎదురుచూడడం కూడా కాస్త కష్టమే. ఎందుకంటే కాస్త పేరు, హిట్ వున్న దర్శకులు అటు ఇటు చూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లందరికీ ఇప్పుడు అవకాశాలు తక్కువ వున్నాయి. సీనియర్ హీరో రవితేజ కు మాత్రమే కాస్త నిర్మాతలు వున్నారు. కొంతలో కొంత గోపీచంద్ కు బెటర్. ఇంకా హిందీ మార్కెట్ కొంచెం వుంది. అందువల్ల ఫరవాలేదు. కానీ సరైన కాంబినేషన్ సెట్ చేస్తే మాత్రం బడ్జెట్ 45 కోట్లకు చేరిపోయి, సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో నిర్మాతలు జంకుతున్నారు. మిగిలిన వారితో సినిమాలు అంటే నిర్మాతలు ముందు వెనుకలు ఆడుతున్నారు.
ఇలాంటి టైమ్ లో రవితేజ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా వుంది. మరో సినిమా డిసైడ్ అయి వుంది. గోపీచంద్ కు ఒకటి విడుదలకు రెడీ అవుతోంది. మరోటి షూట్ లో వుంది. వరుణ్ తేజ్ కు ఓ సినిమా నిర్మాణంలో వుంది. శర్వానంద్ చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్,నాగ శౌర్యకు ఏ సినిమా కూడా సెట్ మీద లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి.
ఇలా ఎవరి చేతిలో ఎన్ని వున్నా, ఎన్ని లేకున్నా, వీళ్లందరికీ ఇప్పుడు అర్జంట్ గా ఓ సక్సెస్ అయితే రావాల్సి వుంది. ఆ సక్సెస్ ను బట్టే తరువాత సినిమాల పరిస్థితి ఆధారపడి వుంటుంది. లేదూ అంటే మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం మందగిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి చేతులు మారే పరిస్ధితి, కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల టాలీవుడ్ టైర్ 2 హీరోలు అందరికీ అర్జంట్ గా ఓ హిట్ పడాలి.