జగన్ పార్టీకి స్టార్ కేంపెయినర్లు లేరా?

ఎన్నికల్లో సరైన, బలమైన అభ్యర్థుల ఎంపిక ఎంత ముఖ్యమో పార్టీలకు ప్రచారం చేసే నాయకులూ అంతే ముఖ్యం. పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళు కాకుండా జనాన్ని అట్రాక్ట్ చేసే నాయకులు…

ఎన్నికల్లో సరైన, బలమైన అభ్యర్థుల ఎంపిక ఎంత ముఖ్యమో పార్టీలకు ప్రచారం చేసే నాయకులూ అంతే ముఖ్యం. పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళు కాకుండా జనాన్ని అట్రాక్ట్ చేసే నాయకులు చాలా అవసరం. వీళ్ళనే స్టార్ కేంపెయినర్లు అంటారు. ప్రతి పార్టీ ఇలాంటివారిని ఎంపిక చేస్తుంది. ఆ జాబితాను ఎన్నికల కమిషన్ కు పంపుతుంది. ఎంతమంది స్టార్ కేంపెయినర్లు ఉండాలనేది ఆయా పార్టీల ఇష్టం.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు యుద్ధానికి సిద్ధమంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. సీట్లు పంచుకున్నాయి. ఈ కూటమిలో బీజేపీ చేరేదీ లేనిదీ ఇంకా క్లారిటీ రాలేదు. మరోపక్క కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా జత కలిశాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇదీ ప్రస్తుతం ఏపీలో ఉన్న సీన్. 

ఇప్పుడు జనాల్లో, పొలిటికల్ సర్కిల్స్ లో ఏ పార్టీ స్టార్ కేంపైనర్లు ఎవరు అనే చర్చ జరుగుతోంది. వైసీపీకి బలం సీఎం జగన్మోహనరెడ్డి. ఆయనే ఆ పార్టీకి బాహుబలి కూడా. అలాంటి సీఎం జగన్.. ఇప్పుడు జనంపైకి ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. మొన్నటి వరకూ తనకు ఛానెల్స్ లేవని.. విపక్షాలకు ఛానెల్స్, పేపర్లు ఉన్నాయని ప్రసంగిస్తూ వచ్చారు. ఇప్పుడు తన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు లేరంటున్నారు సీఎం జగన్.  

చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ ఓస్టార్ క్యాంపెయినర్ అని, బీజేపీలో ఉన్న వదిన పురంధేశ్వరి మరో స్టార్ క్యాంపెయినర్ అన్నారు. రాష్ట్రాన్ని చీల్చి, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌లోనూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నారంటూ… సోదరి షర్మిలను పరోక్షంగా టార్గెట్ చేశారు సీఎం జగన్. పసుపు, కమలాల మనుషులు బాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారు. ఇంకా స్టార్‌ క్యాంపెయినర్‌లు చాలామందే ఉన్నారు. 

అమరావతిలో బాబు బినామీలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారు. చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి గజ దొంగల ముఠా ఉంది. ఆయనకు మంచి చేసిన ఘనతే లేదు. పాలనతో మోసం చేసిన ఘనతే ఉందని విమర్శించారు. ఏం చేయని ఆయనకు ఇంత మంది స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారు. 

బాబును భుజాన మోసే ముఠా చాలా మందే ఉన్నారు. తనకు అలాంటి వారు ఎవరూ లేరన్నారు. తను ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లన్నారు సీఎం జగన్. జగన్ ఇలా అంటున్నప్పటికీ ఆయన పార్టీలోనూ స్టార్ కేంపెయినర్లు ఉన్నారని అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వైఎస్ ష‌ర్మిల‌, జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ‌లు.. స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ప్ర‌చారం చేశారు. వీరికి తోడు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మోహ‌న్‌బాబు, అలీ. వంటివారు కూడా.. ప్ర‌చారంలో దూకుడు చూపించారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. బాల‌య్య కొంత వ‌రకు మేనేజ్ చేశారు. సినిమా రంగం నుంచి పెద్ద‌గా ఎవ‌రూ రాక‌పోయినా.. ప్ర‌దానంగా చంద్రబాబే ప్ర‌చారాన్ని భుజాన వేసుకున్నారు.

వైసీపీ ప్ర‌చారాన్ని జ‌గ‌న్‌.. ఆయ‌న కుటుంబం మోసింది. ఆయ‌న స‌తీమ‌ణి భారతి కూడా.. పులివెందుల స‌హా క‌డ‌ప‌లో ఇంటింటి ప్ర‌చారం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి టికెట్లు పొందే నాయ‌కులు.. కొంద‌రు.. స‌మీప నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌ల ను కూడా నెత్తిన వేసుకోవాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో స్టార్ క్యాంపెయిన‌ర్లుగా కొంద‌రిని ఎంపిక చేస్తున్న‌ట్టు స‌మాచారం.

మాస్ ఇమేజ్ స‌హా వాగ్దాటి ఉన్న నాయ‌కుడు..టీడీపీపై విరుచుకుప‌డే వారు కీల‌కంగా మార‌నున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వంటివారిని తీసుకుంటే.. వీరిలో నాని, రోజా ఇద్ద‌రూ కూడా ఫైర్ బ్రాండ్స్ పైగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారికి మంచి ఫాలోయింగ్ ఉంది. మాస్ నుంచి క్లాస్ వ‌ర‌కు కూడా.. వీరు ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంది. 

దీంతో ఇలాంటి వారిని ఎంపిక చేసి స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఎంపిక చేయాల‌ని వైసీపీ నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వీరు మాత్ర‌మే కాదు.. ఫైర్ ఉన్న నాయ‌కుల‌ను ఎంపిక చేయాల‌ని క‌నీసం 10 -15 మందితో స్టార్ క్యాంపె యిన్ టీంల‌ను ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. వీరంతా.. త‌మ త‌మ‌ని యోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి పార్టీని గెలిపించాలి. 

అదే విధంగా పేర్ని నాని, గుడివాడ అమ‌ర్నాథ్ ‌వంటి వారు.. ఆయా సామాజిక వ‌ర్గాలు.. జిల్లాల‌కు ప‌రిమితం చేసి.. బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న చేస్తున్నారు. రాష్ట్రాన్ని నాలుగు వైపుల నుంచి కమ్ముకుని ప్రచారం చేయడానికి అవసరమైన స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ, జనసేన కూటమికి ఉన్నారు. టీడీపీ నుంచి చీఫ్ చంద్రబాబునాయుడు తో పాటు నారా లోకేష్ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన వైపు నుంచి క్రౌడ్ పుల్లర్ పవన్ కల్యాణ్ ఎలాగూ ఉంటారు. 

మరో వైపు పవన్ కల్యాణ్ కోసం.. జనసేన కోసం.. సినీ తారలు తరలి వస్తారు. ఒక వేళ బీజేపీ కూటమిలోకి వస్తే.. ప్రధానమంత్రి కూడా ప్రచారానికి వస్తారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. గతంలో జగన్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు. ఈ సారి వారు కూడా లేరు. ఈ కారణంగా ప్రచార భారం అంతా తాను ఒక్కరే మోయాల్సి ఉంది. 

తెలంగాణలో కేసీఆర్ వంద ప్రచార సభల్లో ప్రసంగించారు. రోజుకు మూడు, నాలుగు సభల్లో మాట్లాడారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత కూడా ప్రచార బాధ్యతలు పంచుకున్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. ఇప్పుడు అంతా ఒంటి చేత్తో సీఎం జగన్ చూసుకోవాల్సి ఉంది. సినీ రంగం నుంచి కూడా ఈ సారి వైసీపీకి మద్దతు లభించే అవకాశాలు కనిపించడంలేదు.   

గతంలో ఫృధ్వీ నేతృత్వంలో ఓ టీమ్ ప్రచారం చేసింది. ఈ సారి ఆయన కూడా దూరమయ్యారు. అలీ పార్టీలో ఉన్నా.. ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోతే.. ఆయన కూడా ప్రచారం చేస్తారో లేదో తెలియదు. ఇక గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మోహన్ బాబు కూడా దూరమయ్యారు. దాదాపుగా జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతల్ని మోయాల్సి ఉంది.