టీడీపీకి ఎంపీ అభ్యర్థులు లేని కొరతను వైసీపీ తీరుస్తోంది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీలు.. జనసేన, టీడీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా మరో వైసీపీ ఎంపీ రాజీనామా చేయడంతో, ఇక ఆయన టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడమే మిగిలి వుంది. ఇవాళ వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశారు. కొంత కాలంగా మాగుంటకు ఒంగోలు టికెట్ విషయమై తీవ్ర చర్చనీయాంశమైంది.
ఒంగోలు ఎంపీ సీటును తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని సీఎం జగన్‌ను మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కోరారు. అందుకు ససేమిరా అనడంతో సమస్య తలెత్తింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారడంతో, ప్రత్యర్థులపై మాట మాత్రమైనా విమర్శలు చేయకపోవడంతో మాగుంట విషయమై జగన్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీంతో తనకు నమ్మకస్తుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించేందుకు జగన్ నిర్ణయించారు.
ఇప్పటికే ఒంగోలు లోక్‌సభ పరిధిలో భాస్కర్‌రెడ్డి టీమ్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇక వైసీపీలో ఉన్నా, టికెట్ రాదని భావించిన మాగుంట, పార్టీని వీడేందుకు నిర్ణయించారు. ఈ రోజుతో ఆయనకు వైసీపీతో బంధం తెగిపోయింది. మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీని వీడుతున్నందుకు చాలా బాధగా వుందన్నారు. తన కుమారుడిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని అనుకున్నానని, టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించిందన్నారు.
ఆత్మాభిమానం చంపుకుని వైసీపీలో వుండలేనన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. 2014లో టీడీపీ తరపున ఒంగోలు నుంచి పోటీ చేసిన మాగుంట ఓడిపోయారు. నాడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. వైసీపీని వీడిన మచిలీపట్నం, నరసారావుపేట ఎంపీలు బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయులు అవే స్థానాల నుంచి జనసేన, టీడీపీ తరపున పోటీ చేయనున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం వుంది. నేడో, రేపో టీడీపీలో మాగుంట చేరనున్నారు. ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.