కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేయడం ఖాయమైనట్టు జనసేన కీలక నేతలు చెబుతున్నారు. పిఠాపురంలో పవన్‌కు అంత ఈజీగా వుండదని స్థానికులు చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా ఉన్నారని, అందుకే గెలుపుపై ధీమాతో అక్కడికి పవన్ వెళుతున్నారనే చర్చకు తెరలేచింది.
ఇదే సందర్భంలో పిఠాపురంలో నాణేనికి రెండో వైపు గురించి కూడా మాట్లాడుకుంటే… పవన్‌కు అంత ఈజీ కాదని అంటున్నారు. పవన్‌పై టీడీపీ రెబల్ అభ్యర్థి వర్మ పోటీ చేస్తారని అక్కడి స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ వెనక్కి తగ్గరనే మాట వినిపిస్తోంది. పిఠాపురంలో వర్మకు సొంత ఇమేజ్ వుందని, టీడీపీ కేవలం నామ మాత్రమే అని చెబుతున్నారు.
2009లో పిఠాపురం నుంచి వంగా గీత ప్రజారాజ్యం పార్టీ తరపున తన సమీప ప్రత్యర్థి, టీడీపీ నాయకుడు వీఎస్ఎన్ వర్మపై కేవలం 1,036 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం 43,431 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
2014లో వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై 47 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డ్ సృష్టించారు. ఈ ఎన్నికలో టీడీపీకి కేవలం 15,187 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి వర్మ వ్యక్తిగతంగా ఎంత స్ట్రాంగ్ లీడరో అర్థం చేసుకోవచ్చు.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దొరబాబు తన సమీప ప్రత్యర్థి వర్మపై 14,989 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థి ఎం.శేషుకుమారికి కేవలం 28,011 ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు 90 వేల ఓట్లు కాపులకు ఉన్నాయని చెప్పుకుంటున్న నియోజకవర్గంలో జనసేనకు మొక్కుబడి ఓట్లు రావడం గమనార్హం. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ ఇన్చార్జ్ వర్మ 8 నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇటీవల పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీతను సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో పోటీ వర్మ వర్సెస్ గీత మధ్య వుంటుందని భావిస్తున్న తరుణంలో, ఉన్నట్టుండి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే తాను మాత్రం పోటీలో వుండి తీరుతానని వర్మ స్పష్టం చేస్తున్నారు. వర్మకు క్షేత్రస్థాయిలో బలం వుండడంతో, దాన్ని పోగొట్టుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు.
ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అధికారికంగా పవన్ పోటీపై స్పష్టత వస్తే, వర్మ రియాక్షన్ ఏంటనేది తెలుస్తుంది. వర్మ మాత్రం తన నాయకత్వాన్ని మరెవరి కోసమో బలి పెడతారని ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా వర్మ బరిలో వుంటారని, గతానుభవాల దృష్ట్యా చెబుతున్నారు.