ఫైటర్ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిషేధించారు. ఆ తర్వాత 'ఆర్టికల్ 370' సినిమాను కూడా నిషేధించినట్టు వార్తలొచ్చాయి. స్వయంగా ఆ సినిమా పీఆర్ టీమ్ ప్రకటన చేయడంతో అంతా నిజం అనుకున్నారు. కానీ వాస్తవం అది కాదు.
బాలీవుడ్ లో క్రిటిక్స్ మెప్పు పొందిన 'ఆర్టికల్ 370' సినిమా త్వరలోనే గల్ఫ్ దేశాల్లో కూడా విడుదలకాబోతోంది. కేవలం సెన్సార్ సర్టిఫికేషన్ కోసం మాత్రమే ఎదురుచూస్తోంది.
ఈనెల 23న థియేటర్లలోకి వచ్చింది 'ఆర్టికల్ 370' సినిమా. యామీ గౌతమ్ నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఆపాదించిన ఆర్టికల్ 370 చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో విడుదల చేయడానికి కొంతమంది అభ్యంతరం తెలిపారంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఫైటర్ తర్వాత నిషేధం ఎదుర్కొన్న రెండో సినిమాగా ఆర్టికల్ 370 నిలిచిందని అంతా అనుకున్నారు.
అయితే ఈ సినిమాపై ఎలాంటి బ్యాన్ లేదని, సర్టిఫికేట్ కోసం మాత్రమే ఎదురుచూస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. త్వరలోనే గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.