రాంగ్ రూట్ లో వెళ్లింది. అడ్డుకున్న పోలీసును నానా మాటలంది. అక్కడితో ఆగకుండా అతడి జాకెట్ చించేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రోడ్డుపై నానా రచ్చ చేసింది.
ఇదంతా చేసిన వ్యక్తి సౌమ్య జాను అనే చిన్న నటి. బంజారాహిల్స్ లో జాగ్వార్ కారులో రాంగ్ రూటులో రయ్ మంటూ దూసుకెళ్లిన ఈ హీరోయిన్, అడ్డొచ్చిన హోంగార్డ్ యూనిఫాం చించేసింది.
జరిగిన ఘటనపై ఆల్రెడీ కేసు నమోదైంది. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకుంటే పెద్ద కేసు అవుతుందనే విషయం తెలిసిందే. పైగా సౌమ్య జాను చేసిన పనిని, అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు, అది కాస్తా వైరల్ అయింది.
అలా వీడియో సాక్షిగా దొరికిన సౌమ్య, తను చేసిన పనిపై వివరణ ఇచ్చింది. తన అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, అర్జెంట్ గా మందులు తీసుకొచ్చేందుకు, తప్పనిసరి పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఇదే విషయాన్ని హోంగార్డ్ కు చెప్పినప్పటికీ, అతడు వినిపించుకోలేదని, పైగా బూతులు తిట్టాడని, అందుకే తను కూడా బూతులు తిట్టానని చెప్పుకొచ్చింది సౌమ్య. హోంగార్డ్ ఓవర్ గా రియాక్ట్ అవ్వడం వల్లనే తను కూడా ప్రతిస్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది.
తాగి బండి నడిపాననే వాదనను ఖండించింది సౌమ్య. తను మందు కొట్టనని, కావాలంటే తను పరీక్షలకు సిద్ధమని తెలిపింది. జరిగిన ఘటనను వీడియో తీశారనే విషయం తనకు తెలియదని, పొద్దున్న లేచిన తర్వాత వీడియో చూసి ఆశ్చర్యపోయానని అంటోంది ఈ నటి.
ఈ సంగతులు పక్కనపెడితే, సౌమ్య తీసిన ఓ లాజిక్ మాత్రం భలేగా ఉంది. తనలాంటి వాళ్లనే రాంగ్ రూట్ లో వెళ్లనివ్వకుండా అడ్డుకుంటే, ఇక సామాన్యుల పరిస్థితేంటంటూ ఆమె ప్రశ్నించడం మాత్రం ఫన్నీగా ఉంది. అర్జెంట్ పని మీద రాంగ్ రూట్ లో వెళ్తే తప్పేముందనేది ఆమె వాదన.