పీలా గోవింద్ కు బుజ్జగింపు!

అనకాపల్లి రాజకీయం మెల మెల్లగా మారుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు కొణతాల రామకృష్ణ దూరంగా వుండడంతో, కేడర్ అంతా వేరే వేరే వెళ్లిపోయింది. ఎవరి పనుల్లో వారు వుండిపోయారు. దీంతో కొణతాల రామకృష్ణ ముందుగా…

అనకాపల్లి రాజకీయం మెల మెల్లగా మారుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు కొణతాల రామకృష్ణ దూరంగా వుండడంతో, కేడర్ అంతా వేరే వేరే వెళ్లిపోయింది. ఎవరి పనుల్లో వారు వుండిపోయారు. దీంతో కొణతాల రామకృష్ణ ముందుగా తన కేడర్ అందరినీ కలుసుకునే పని పెట్టుకున్నారు.

ఇల్లు చక్కబెట్టుకున్న తరువాత వైరి వర్గం సంగతులు చూద్దామనే ఆలోచనతో, ఒకప్పుడు తనతో వున్న వారందరినీ పేరు పేరునా లిస్ట్ రాసుకుని, ఇళ్లకు వెళ్లి మరీ మాట్లాడి మళ్లీ తన వర్గం అంటూ తాను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.

అదే సమయంలో తెలుగుదేశం టికెట్ ఆశించి, అలిగిన పీలా గోవింద్ తో పార్టీ అధిష్టాన వర్గం మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన సైలంట్ గా తన ఇంటికే పరిమితం అయ్యారు. కాస్త సర్దుకున్నాక, కొణతాల స్వయంగా వెళ్లి పీలా గోవింద్ తో సమావేశం అవుతారు. పీలాకు, కొణతాలకు దగ్గర బంధుత్వం వుంది. అందువల్ల ఈ లోగా బంధువులు ఈ సమావేశానికి మార్గం సుగమం చేస్తున్నారు.

ఇలా పార్టీల వ్యవహారాలు చకచక్క దిద్దుకున్నాక, నియోజకవర్గం పరిథిలో వున్న గ్రామాల నాయకులను కబురుపెట్టి, ఓ సమావేశం నిర్వహించే దిశగా పనులు సాగుతున్నాయి. నిజానికి కొణతాలకు కాలు గాయం వల్ల పెద్దగా తిరిగే అవకాశం లేదు. కానీ ఇప్పుడు తప్పదు కనుక, అలాగే ప్రచారం పని మొదలుపెట్టేసారు.

ఇక మిగిలింది ఫైనాన్షియల్ గా మద్దతు తెచ్చుకోవడమే. నాగబాబు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక, పవన్ కళ్యాణ్ కోరి కొణతాలను పార్టీలోకి తెచ్చుకున్నారు కనుక అట్నుంచి కొంత వరకు మద్దతు లభించే అవకాశం వుంది.