అవును.. ఆ హోటల్ కు నేను వెళ్లాను – క్రిష్

రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసుకు సంబంధించి అనూహ్యంగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు 8వ నిందితుడిగా క్రిష్ ను తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ అంశంపై క్రిష్ స్పందించాడు.…

రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసుకు సంబంధించి అనూహ్యంగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు 8వ నిందితుడిగా క్రిష్ ను తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ అంశంపై క్రిష్ స్పందించాడు. తను హోటల్ కు వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించాడు.

ఆదివారం రాత్రి క్రిష్, రాడిసన్ బ్లూ హోటల్ కు వెళ్లాడు. కామన్ ఫ్రెండ్ కాల్ చేయడంతో అక్కడకు వెళ్లాడట. ఏ గదిలోనైతే డ్రగ్స్ తీసుకున్నారో, అదే గదిలో క్రిష్ కాసేపు గడిపాడు. అయితే ఆ హోటల్ లో తను కేవలం ఓ గంట మాత్రమే గడిపానని, ఆ తర్వాత వెంటనే తను అక్కడ్నుంచి బయల్దేరానని అంటున్నాడు క్రిష్.

మొత్తం డ్రగ్స్ వ్యవహారానికి కారణమైన వివేకానంద్ ను కలిసేందుకే క్రిష్ అక్కడకు వెళ్లాడా లేదా మరో కామన్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లాడా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. మరోవైపు సూత్రధారి వివేకానంద్కు, క్రిష్ కు మధ్య ఎలా పరిచయం ఏర్పడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రిష్ నుంచి స్టేట్ మెంట్ కూడా తీసుకోబోతున్నారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వివేకానంద్ ను అరెస్ట్ చేయగా, అతడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. కేదార్ తో పాటు మరొకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. మిగిలిన వ్యక్తుల్ని విచారణ కోసం పిలిపించగా.. వీళ్లలో యూట్యూబర్ లిషి గణేశ్ తన అడ్రస్ తప్పు ఇచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో పబ్ కు బజ్జి తినేందుకు వెళ్లానంటూ స్టేట్ మెంట్ ఇచ్చి వైరల్ అయిన లిష్, ఈసారి పోలీసులకు తప్పుడు సమాచారం అందించిందట. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్, అడ్రస్ అన్నీ తప్పని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆమె పోలీసులకు అందుబాటులోకి రాలేదు.

ఇక డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ పై మాత్రం మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తమదైన శైలిలో ప్రశ్నించి, మాజిద్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తెచ్చాడనే విషయాన్ని కూడా బయటకు రాబట్టారు.

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, ఇలాంటి కేసుల్లో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులెవ్వరికీ శిక్షలు పడవు. కనీసం వాళ్లపై కేసు కూడా నమోదు చేయరు. కేవలం వాళ్లను బాధితులుగానే చూస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులకు మాత్రమే శిక్షలు పడతాయి, డ్రగ్స్ సేవించిన వాళ్లకు కాదు.